విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆవిర్భవించిందన్నారు. నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని , అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీకే దక్కుతుందని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. అలాగే 2026 జనవరి 18న ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ పార్టీ 100 వసంతాల వేడుకలకు సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు రాజు, సహాయ కార్యదర్శి తిక్కన్న, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, కార్యదర్శి షేక్షావలి, నాయకులు ఇస్మాయిల్, మహ్మద్, నాగేష్, గోపాల్, వీరేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.


