ఎంపీడీఓ బి.విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు : పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన రాకుండా ఉండేందుకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాప్తాడు ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల రక్తహీనత , పోషకాహార లోపం పిల్లలలో ఉండదని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకొనే సామర్థ్యము పెరుగుతుందన్నారు. 1-19 సంవత్సరము పిల్లలందరూ తప్పక మాత్రలు వేసుకోవాలన్నారు. డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ చేతి చేతి వేళ్ల గోళ్లను శుభ్రంగా వుంచుకోవడంతోపాటు బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలన్నారు. కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడిగి తినాలన్నారు. ఆహారం తినక ముందు, తిన్న తరువాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, డిప్యూటీ ఎంపీడీఓలు అచ్యుతానంద, అశోక్ బాబు, సీహెచ్ఓ శివ ప్రసాద్, హెచ్ఎం రాజేశ్వరి, సూపర్వైజర్ నరసింహ, ఏఎన్ఎం ఝాన్సీ, ఆశా కార్యకర్త గాయత్రి, తదితరులు పాల్గొన్నారు.


