విశాలాంధ్ర, అమరాపురం: హేమ మండల సమాఖ్య సంఘానికి సంబంధించిన నిధుల వినియోగంపై మండలంలోని గ్రూప్ సభ్యులు, స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘానికి ఎంత మొత్తంలో నిధులు వచ్చాయి.. వాటిని ఏయే కార్యక్రమాలకు ఖర్చు చేశారు.. ప్రస్తుతం ఎంత మొత్తం అందుబాటులో ఉంది అనే వివరాలను బహిర్గతం చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సంఘం నిధుల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. నిధుల రాకపోకలు, ఖర్చుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, సంబంధిత రికార్డులను సభ్యులకు, మండల పరిధిలోని కమిటీ సభ్యులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
‘సంఘం సొమ్ము.. సభ్యుల సొమ్ము.. లెక్కలు చెప్పాల్సిందే’ అంటూ పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు. నిధుల వినియోగంపై అధికారులు సమగ్రంగా పరిశీలించి, ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.సంఘానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏయే పథకాల ద్వారా ఎంత మొత్తం మంజూరైంది? వాటిని ఏ పనులకు వినియోగించారు? ప్రస్తుతం బ్యాంకు ఖాతాల్లో ఎంత మొత్తం ఉంది? అనే వివరాలపై హేమ మండల సమైక్య అధికారులు, సంబంధిత ఉన్నతాధికారులు, సంఘం నిర్వాహకులు స్పష్టత ఇవ్వాలని సభ్యులు కోరుతున్నారు. నిధులపై పూర్తి స్థాయి లెక్కలు వెల్లడిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రూప్ సభ్యులు, స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు దృష్టి సారించి సమగ్ర వివరాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు.


