విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ సభ్యులు, కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య శకుంతల, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై ఎస్ఐ శివ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


