విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆదోనిలో జరుగుతున్న పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనానికి మంగళవారం పెద్దకడబూరు నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రాష్ట్రంలో అరకొర పంటలు పండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీనికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. అధిక వర్షాల వల్ల పత్తి పంట నాశనం అయిందని, పత్తి అమ్మకానికి మార్కెట్ వెళితే పత్తి తడిసిందని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి ఎకరానికి 80 వేలు పెట్టుబడులు పెట్టారన్నారు. పెట్టిన పెట్టుబడులు చేతికి రాక, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం రైతులకు పత్తి క్వింటాళ్లకు 12వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, రెండు పంటలకు సాగునీరు ఇవ్వాలని, పెండింగ్ లో ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని డిమాండ్లతో రాష్ట్ర రైతు సమ్మేళనం జరుగుతుందన్నారు. కావున రైతులందరూ ఈ సమ్మేళనంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, నాయకులు నాగరాజు, షేక్ హజరత్, సయ్యద్ వలీభాష, మహబూబ్, దూద్ పీరా, షేక్ అలీ భాష, ఇస్మాయిల్, బాబు, తలారి బాబు, రెక్కల గిడ్డయ్య, బిత్తర బాబు తదితరులు పాల్గొన్నారు.


