విశాలాంధ్ర బెళుగుప్ప, : పంపనూరు సమీపంలోని కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయిన బెళుగుప్ప మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి మృతదేహం తీవ్ర గాలింపు చర్యల తర్వాత సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానిక వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు పొలం సర్వే నెంబర్ 543 సమీపంలోని హంద్రీనీవ కాలువ వద్ద డాక్టర్ కార్తీక్ రెడ్డి మృతదేహం కనిపించింది. స్థానిక ప్రజలు మరియు సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీశారు. వెంటనే బంధువులకు సమాచారం అందించి, వారి సమక్షంలో మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


