–ఏపీ సి.ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు
విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా) : 2013–14 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల వరకు దాదాపు 11 సంవత్సరాల కాలంలో ఆస్పరి కో–ఆపరేటివ్ సొసైటీ లావాదేవీలపై ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ 1964 యాక్ట్ లోని 51వ సెక్షన్ ప్రకారం ఎంక్వయిరీ ద్వారా విచారణ చేపట్టినట్లు పత్తికొండ డివిజన్ కో–ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సొసైటీ పరిధిలోని రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. ఆస్పరి సొసైటీ పరిధిలో రూ.10 లక్షల వరకు భూములను తాకట్టు పెట్టి మార్ట్గేజ్ లోన్లు తీసుకున్న రైతుల నుంచి అధికారులు లేదా సిబ్బంది అధిక శాతం (పర్సంటేజ్) వసూలు చేసినా, లేక అధిక వడ్డీ చెల్లింపులు చేయించినా, అలాంటి రైతులు నేరుగా సొసైటీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో రెండు రోజుల పాటు విచారణ కొనసాగుతుందని, అన్యాయానికి గురైన రైతులు సంబంధిత పత్రాలు, ఆధారాలతో తమ ఫిర్యాదులను నమోదు చేయాలని సూచించారు.


