–కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన గ్రేడ్–2 పంచాయతీ అధికారి విజయరాజు, గ్రంథాలయ అధికారి విశ్వనాథరెడ్డి లకు సోమవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. మండల పరిధిలోని జొహారాపురం గ్రామ పంచాయతీలో గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, అదేవిధంగా ఆస్పరి మేజర్ గ్రామపంచాయతీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయరాజును జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేశారు. అలాగే ఆస్పరి గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న విశ్వనాథరెడ్డిని కూడా జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డుతో సత్కరించారు. ప్రజాసేవలో నిబద్ధత, విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభను గుర్తించి వీరిని ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. సహ ఉద్యోగులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


