Homeజిల్లాలుకర్నూలుఎమ్మార్వో సంతకం ఫోర్జరీతో భూ రిజిస్ట్రేషన్..?

ఎమ్మార్వో సంతకం ఫోర్జరీతో భూ రిజిస్ట్రేషన్..?

- Advertisement -

–ఆ సంతకం నాది కాదు.. వెంటనే ఫిర్యాదు చేయండి
–దేవనకొండ తహసీల్దార్ రామేశ్వరరెడ్డి

విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలోని చిగలి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మన్నకు చెందిన భూమికి సంబంధించి మండల తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమి ధ్రువీకరణ పత్రం సృష్టించి, దాని ఆధారంగా స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ జరిపినట్లు బాధితుడు ఆరోపిస్తూ మండల తహసీల్దార్ మల్లికార్జున రెడ్డి కి, స్థానిక పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంగళవారం బాధితుడు లక్ష్మన్న తెలిపిన వివరాల ప్రకారం, మా గ్రామంలో సర్వే నంబర్ 189/A లోని 18 సెంట్ల భూమి ఉందన్నారు. తన భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో భూమిని విక్రయించిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు సాక్షులుగా సంతకాలు చేసిన ఇద్దరిపై కూడా సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే క్రిమినల్ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి గతంలో ఆస్పరి తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం దేవనకొండ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రామేశ్వరరెడ్డి మంగళవారం ఆస్పరి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సంబంధిత పత్రాలను పరిశీలించినట్లు తెలిసింది. అనంతరం ఆ పత్రాలపై ఉన్న సంతకం నాది కాదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అవసరమైతే ఉన్నతాధికారులతో నేను మాట్లాడుతాను. విచారణలో ఫోర్జరీ జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా సహకరిస్తాను అని బాధితుడికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం ఆస్పరి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునరెడ్డి కూడా ఈ వ్యవహారంపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుడికి సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వ అధికారి సంతకాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే అది అత్యంత తీవ్రమైన నేరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు, పోలీసులు సమన్వయంతో సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధితుడికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా కార్యదర్శి పెద్ద సంజప్ప, టిడిపి యువ నాయకులు యుగంధర్ లు తాసిల్దార్ ను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు