విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టనున్న బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలి ఉద్యమంలో భాగంగా నిర్వహించనున్న పాదయాత్రలు, ఆందోళన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఐ నార్పల మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు.ధరల నియంత్రణ, యువతకు ఉపాధి కల్పన, ప్రభుత్వ విద్యా–వైద్య రంగాలకు అధిక నిధుల కేటాయింపు, రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, కార్మికులు, దళితులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎన్నికలకు ప్రభుత్వ నిధుల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పాదయాత్రలు, ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచార ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1, 2026న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో “బద్లావ్ జరూరీ హై” ర్యాలీతో పాటు “చలో ఢిల్లీ” మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ప్రజల అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు మతపరమైన విభజన రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం చేపడుతున్న ఉద్యమాల్లో ప్రజలు, యువత, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శులు చాపల రామాంజి, సాకే సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, సీపీఐ సీనియర్ నాయకులు నాగరాజు, సూరి, అల్తాఫ్, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.


