Homeజిల్లాలుఅనంతపురంనార్పల బస్టాండ్‌లో మొబైల్ దొంగల రాజ్యం…..!

నార్పల బస్టాండ్‌లో మొబైల్ దొంగల రాజ్యం…..!

- Advertisement -

ప్రయాణికులే టార్గెట్.. పోలీసుల నిఘా ఎక్కడ……?

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని బస్టాండ్ మొబైల్ దొంగలకు అడ్డాగా మారిందనే విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ చోరీలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ, వాటిని అరికట్టడంలో ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్తున్న ఓ మహిళ బ్యాగ్‌ను బ్లేడ్‌తో కత్తిరించి అందులోని సెల్‌ఫోన్‌ను అపహరించేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. అప్రమత్తమైన బాధితురాలు వెంటనే ఆమెను వెంబడించి పట్టుకోగా, స్థానికులు సహకరించి నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.అయితే ఇది ఒక్కరోజు జరిగిన ఘటన మాత్రమే కాదని, బస్టాండ్‌లో తరచూ మొబైల్ చోరీలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వాస్తవంగా జరిగిన చోరీల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు బస్టాండ్‌ను కేంద్రంగా చేసుకుని రద్దీ సమయాల్లో మహిళలు, వృద్ధులు, అమాయక ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల కదలికలను గమనిస్తూ బ్యాగులు కత్తిరించడం, జేబులు కొట్టడం, మొబైళ్లు అపహరించడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సివిల్ డ్రస్ సిబ్బందితో పర్యవేక్షణ పెంచాలని, అనుమానితుల కదలికలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.బస్టాండ్‌కు వస్తే ప్రయాణం కంటే ముందే మొబైల్ పోతుందేమోననే భయం కలుగుతోంది అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ చోరీలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, బస్టాండ్‌లో భద్రతను మరింత పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు