
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న నేపధ్యం లో తాము మాత్రం ఇంకా ఆటోలనే ఆశ్రయిస్తూ, ప్రభుత్వం అందించే ఉచిత ఫలాలను పొంద లేక పోతున్నామని తాళ్లపూడి మండలం తిరుగుడు మెట్ట గ్రామానికి చెందిన ప్రజలు ముఖ్యన్గా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు కేవలం ఆధార్ కార్డు చూపించి రాష్ట్రమంతా ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ తమ వూరు మహిళలకు ఈ అదృష్టం దక్కడం లేదని తిరుగుడుమెట్ట మహిళలు వాపోతున్నారు. అసలు తమ గ్రామానికి బస్ సౌకర్యం కరువై ఆరేళ్ళ పై మాటే అని, అప్పట్లో రోడ్ సౌకర్యం గా లేదని కొన్నాళ్ళు, వ్యవసాయ సంబంధిత గ్రామాలైన ఈ ప్రాంతాల్లో ట్రాక్టర్ల తోను, వాహనాలు తో రాకపోకలకు ఇబ్బంది గా ఉందని కొన్నాళ్ళు అనేక వంకల్తో బస్ సౌకర్యాన్ని ప్రజలకు దూరం చేశారు. రాజమహేంద్రవరం నుండి వయ కుమారదేవం, రావూరుపాడు, తిరుగుడు మెట్ట చిన్నాయ్యగూడెం వరకు ఆర్టీసీ బస్ సర్వీస్ కొవ్వూరు డిపో నుండి ఉండేది. బస్ రద్దయి నప్పటి నుండి ప్రవేట్ వాహనాలు స్వంత వాహనాలు, ఆటోలే ఆధారంగా ప్రజలు ప్రయాణిస్తూన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణం సాగిస్తుంటే మైన్ రోడ్ కు దూరంగా కిలోమీటర్, రెండు కిలోమీటర్ల్ దూరం లో ఉన్న రావూరుపాడు, టి.మెట్ట గ్రామస్థులు మైన తమ కు మాత్రం ఈ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరం టు చిన్నాయి గూడెం బస్ తిరగటం వల్ల లూప్ లైన్లో ఉన్న రావురూపాడు గ్రామానికి కూడా ఎంతో ఉపయోగంగా ఉండేది. అలాగే తిరుగుడు మెట్ట గ్రామానికి కూడా ఎంతో ప్రయోజనం గా ఉండేది. ప్రస్తుతం సౌకర్యం లేకపోవటం వల్ల తో ప్రయాణ సౌకర్యం తో పాటు ప్రభుత్వం అందించే ఉచితం అనే సంక్షేమాన్ని కూడా కోల్పోతున్నామంటున్నారు. తమ మనోవేదనలను అర్థం చేసుకొని ఇప్పుడైనా రావూరుపాడు, తిరుగుడు మెట్ట గ్రామాలకి బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల మహిళలు అధికారులను ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.


