స్థానిక ఉపాధిని కాపాడాలని డిమాండ్.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని పుట్టపర్తి రోడ్లో గల జి విఆర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తున్న లెన్స్‌కార్ట్ షోరూమ్ ఎదుట స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు మంజుల నరేంద్ర నాయకత్వం వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా సాకే వినయ్ కుమార్ మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలు నిర్వహిస్తూ సుమారు 200 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల స్థానిక చిన్న వ్యాపారులు, ఉద్యోగుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల ఓట్లతో ఎన్నికైన ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల సమస్యలపై స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన అంశాల్లో అధికారులు వెంటనే స్పందిస్తుండగా, స్థానిక ప్రజల సమస్యలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు.అలాగే సంబంధిత భవనానికి ఉన్న భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ పత్రాలను సంబంధిత శాఖలు సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారుల విచారణలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వర్తించే చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.స్థానిక చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, స్థానిక ఉపాధి పరిరక్షణకు స్పష్టమైన విధానాలు రూపొందించాలని, చిన్న వ్యాపారుల జీవనోపాధిని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని సాకే వినయ్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నాయకులు, సీపీఐ(ఎంఎల్) నాయకులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
లెన్స్‌కార్ట్ షోరూమ్ ఎదుట స్థానిక వ్యాపారులు, ఉద్యోగుల ధర్నా
- Advertisement -
RELATED ARTICLES


