ఈ నెల 28 నుండి పాదయాత్ర ప్రారంభం.
విశాలాంధ్ర గుడిబండ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్వేషాలు, యుద్ధ వాతావరణం మధ్య మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింసా మార్గాన్ని సమాజానికి మళ్లీ గుర్తు చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని సిడబ్ల్యూసీ మెంబర్ శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం నీలకంఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు ‘మహాత్మా గాంధీ సందేశ యాత్ర’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, కేవలం జాతీయ జెండాతో నిష్పక్షపాతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గాంధీజీని పార్టీలకు అతీతంగా గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీ పేరు కలిగిన సంక్షేమ పథకాల నుంచి ఆయన పేరును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాగే గాంధీజీ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న విష ప్రచారం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తాత రంగే గౌడ్, పెదనాన్న శ్రీరామ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధులని, గాంధీజీ పిలుపుతో దళితుల ఆలయ ప్రవేశం కోసం వారు చేసిన పోరాట స్ఫూర్తితోనే ఈ యాత్ర చేపడుతున్నానని వివరించారు. జనవరి 30 (గాంధీజీ వర్ధంతి) నాడు సరిగ్గా 78 మందితో కలిసి హిందూపురంలో ఈ యాత్రను ముగిస్తామని తెలిపారు. నేటి యువత, విద్యార్థులకు గాంధీజీ ఆశయాలు, శాంతి సందేశాన్ని వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు. శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ యాత్రకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరికెర సుధాకర్, ఏఐసీసీ మెంబర్ శ్రీధర్, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు మంజునాథ్, నాగరాజు గౌడప్ప, లోకేష్, గురుమూర్తి, బాబు ప్రసాద్‌లతో పాటు ఐదు మండలాల రఘువీరా రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.


