Homeఆంధ్రప్రదేశ్ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు

ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు

- Advertisement -

ఓ డి ఓ పి- 2024 అవార్డును అందుకున్న మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్

విశాలాంధ్ర ధర్మవరం;భారత దేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం చేనేత పట్టు చీర 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” కార్యక్రమం క్రింద ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ గౌరవం ధర్మవరం పట్టు చీరల ప్రత్యేకతను, నైపుణ్య సంపదను దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపుచేసే దిశగా కీలకంగా మారనుంది. ఈ సందర్భంగా న్యూ ఢిల్లీ భారత్ మండపంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం
మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈ అవార్డులు వాణిజ్య రంగానికే కాకుండా, స్థానిక పరిశ్రమలకు విశేష ప్రోత్సాహం కలిగిస్తున్నాయన్నారు. ఇది కేవలం హస్తకళల ప్రదర్శన మాత్రమే కాకుండా, భారతదేశ భవిష్యత్తుకు ఒక సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు లభించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది ఓ డి ఓ పి అవార్డుకు ధర్మవరం చేనేత పట్టు చీరలతో పాటు, కాకినాడ జిల్లా పెద్దాపురం శిల్క్, బాపట్ల జిల్లా చీరాల శిల్క్ చీరలు, తిరుపతి జిల్లా వెంకటగిరి చీరలు కూడా ఎంపికయ్యాయి అని తెలిపారు. ఈ ఎంపిక ద్వారా రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళలు, చేనేత ఉత్పత్తుల విలువ మరింతగా పెరిగే అవకాశం కలుగుతుంది అని తెలిపారు. శ్రీ సత్య సాయి
జిల్లా కలెక్టర్ ట్.ఎస్.చేతన్ మాట్లాడుతూ..ధర్మవరం చేనేత కార్మికుల నైపుణ్యానికి, పట్టుదలకు ఇది గౌరవ సూచికని, ఈ అవార్డు వల్ల ధర్మవరం చేనేత రంగానికి మరిన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. మార్కెట్, ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి, అంతర్జాతీయ గుర్తింపు సాధించే మార్గంలో ఇది ఒక మైలురాయి అవుతుందన్నారు.
ధర్మవరం చేనేత పట్టు చీరలకు ఈ గౌరవం దక్కినందుకు జిల్లా ప్రజలకు, చేనేత కార్మికులకు వారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, కేంద్ర సహాయ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి జితిన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు