Homeఆంధ్రప్రదేశ్ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు దేశంలో తొలిసారిగా హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.లేపాక్షి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక డిజిటల్ విధానం ద్వారా ప్రతి హస్తకళా ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపును కల్పించనున్నారు. వినియోగదారులు హస్తకళా ఉత్పత్తిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి సమాచారం వెంటనే అందుబాటులోకి వస్తుంది. ఆ కళాఖండం చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, దానిని రూపొందించిన కళాకారుడి పేరు, అతని నైపుణ్యం, తయారీ విధానం వంటి వివరాలు క్యూఆర్ కోడ్‌లో పొందుపరచనున్నారు.

ఒక జిల్లా – ఒక ఉత్పత్తి
అంతేకాకుండా ఉత్పత్తి తయారీలో ఉపయోగించిన ముడిసరుకు, తయారీకి పట్టిన సమయం, వస్తువు పరిమాణాలు వంటి సాంకేతిక వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ వివరాలతో పాటు ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం కూడా క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులోకి రానుంది.మొదటి దశలో రాష్ట్రంలోని ఎనిమిది ప్రముఖ హస్తకళా ఉత్పత్తులకు ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు. బొబ్బిలి వీణ, కలంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసీ పెయింటింగ్స్ వంటి ప్రసిద్ధ హస్తకళా ఉత్పత్తులకు ఇప్పటికే ప్రత్యేక డిజిటల్ ప్రొఫైళ్లను రూపొందించారు.

ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత గుర్తింపు
భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వ్యవస్థ అమలుతో నకిలీ హస్తకళా ఉత్పత్తులను నియంత్రించడంతో పాటు అసలైన కళాఖండాల ప్రామాణికతను వినియోగదారులు సులభంగా నిర్ధారించుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత గుర్తింపు తీసుకురావడం, స్థానిక కళాకారులకు తగిన గుర్తింపు కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రాష్ట్ర హస్తకళలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు