ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ గ్రామ సభలలో ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ గ్రామ జి)గా పేరు మార్చిన నేపథ్యంలో, ఆ పథకంపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పన, సహజ వనరుల పరిరక్షణ వంటి అంశాలపై గ్రామ సభలలో చర్చ నిర్వహించామన్నారు.
అలాగే, విబి- గ్రాము – జికింద పనిచేస్తున్న ఉపాధి కూలీలకు ప్రస్తుతం కల్పిస్తున్న 100 రోజుల ఉపాధిని 125 రోజుల వరకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గ్రామ సభలలో వివరించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి అదనపు పని దినాలు కల్పించి, గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇక “స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ గ్రామ పంచాయతీ” కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పరిశుభ్రత, పారిశుధ్యం, ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల సాధన, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా ప్రదేశాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
గ్రామాలను సంపూర్ణంగా శుభ్రమైనవిగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఈ లక్ష్య సాధనకు ప్రతి గ్రామస్తుడు బాధ్యతతో ముందుకు రావాలని మండల అభివృద్ధి అధికారి , ఉప మండల అభివృద్ధి అధికారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావులచెరువు ,మల్లకల్వ గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో తాను పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఈ ప్రత్యేక గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, గ్రామాభివృద్ధిలో ప్రజాస్వామ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


