ప్రముఖఆలయాల సందర్శనకు ఆర్టీసీ ఏర్పాట్లు.
జిల్లాలో నాలుగు డిపోల ద్వారా 100బస్సు సర్వీసులు..
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు జాబితా రెడీ..
విశాలాంధ్ర-కొవ్వూరు: కార్తీక మాసం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక, విహార యాత్రలకు ఈనెల ఎంతో ప్రత్యేకమైనది. చాలామంది పంచారామాలు, శైవక్షేత్రాలను సందర్శిస్తారు. అదేవిధంగా అయ్యప్ప మాలదారులు శబరిమలకు వెళుతుంటారు. ఈ నేపద్యంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ముందస్తు రిజర్వేషన్లు కూడా చేయించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. జిల్లాలో రాజమండ్రి కొవ్వూరు నిడదవోలు, గోకవరం డిపోల నుంచి 100 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కార్యాచరణ సిద్ధం చేసింది. కార్తీక మాసం నెల రోజులు ఇవి రాకపోకలు సాగిస్తాయి. శని ఆదివారాల్లో పంచారామాలకు ప్రత్యేక బస్సులు. అక్టోబరు 25, 26 పేదలతో పాటు నవంబర్ 2, 9, 16 తేదీల్లో బస్సులు నడపనున్నట్లు సమాచారం. శబరిమల యాత్రకు.. పైన పేర్కొన్న ఈ నాలుగు డిపోల నుంచి శబరిమలకు కొత్త సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 36 సీట్లతో నడిచే బస్సును అయ్యప్ప స్వాములు మొత్తం బుక్ చేసుకుంటే వీరుతోపాటు, ఇద్దరు గురు స్వాములు, ఇద్దరు మణికంఠలు, నిద్ర వంట వాళ్లను ఉచితంగాతీసుకెళ్లే సౌకర్యాన్ని సైతం అనుమతిస్తున్నారు. ఈ బస్సులను ఐదు రోజులు, ఏడు రోజులు, పది రోజులు ప్రయాణ రోజులుగా మూడు వర్గాలుగా విభజించారు. ఐదు రోజుల యాత్రకు ఒక్కరికి 5000, ఏడు రోజులకు 6000, పది రోజులకి 7500 రూపాయలుగా నిర్ణయించారు ఈ మూడు విభాగాలలో విజయవాడ, శ్రీశైలం, రామేశ్వరం కాణిపాకం, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగు ల పదోన్నతులకు జీవో విడుదల ఆర్టీసీ ఉద్యోగులకు వారి సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జీవో విడుదల చేసినట్లుగా సమాచారం. దీనిలో భాగంగా జిల్లా పరిధిలోని డిపోలలో సుమారు 456 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గ్యారేజీలలో పని చేసే ఉద్యోగులకు కూడా పదోన్నతి లభించనుంది.


