విశాలాంధ్ర, ఉరవకొండ ….కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనంతో అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సూపర్ ఫ్లాప్ అని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. 50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని..ఇంత వరకు ఇవ్వలేదన్నారు. అలాగే 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని ప్రైవేటు కంపెనీల ఒప్పందం పేరుతో హడావుడి చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ. 20వేలు ఇస్తున్నారని, పలు రకాల కారణాలు చెబుతూ పథకంలో కోతలు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామమని… అమలుపై నోరెత్తడం లేదన్నారు. మానవత్వం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులకు అడ్డగోలుగా పింఛన్లను తొలగించారన్నారు. వితంతులకు పింఛన్లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటప్పుడు సూపర్సక్స్ విజయవంత సభల నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


