
బిందు సేద్యం పరికరాలను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గం లో 842 కోట్ల రూపాయల వ్యయంతో 22 గ్రామాలకు 50వేల ఎకరాలకు13వేలు మంది రైతులకు ఉపయోగపడే సామూహిక మెగా బిందు సేద్యం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టుకు సంబంధించిన నిరుపయోగంగా పడి ఉన్న పరికరాలను జిల్లా కార్యదర్శి తో పాటు జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, రాజారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని 50 శాతం పనులు కూడా పూర్తి చేశారన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సామూహిక మెగా బిందు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా గాలికి వదిలేసిందని ఆరోపించారు. సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు పూర్తయితే.. తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశపడిన ఉరవకొండ నియోజకవర్గం ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సామూహికబిందుసేద్యం ప్రాజెక్టు పూర్తయితే తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు మారుతాయన్నారు. జీడిపల్లి, పీఏబీఆర్,ఏంపిఆర్ జలాశయాలు ద్వారా 1.67 టీఎంసీల హంద్రీనీవా జలాలను ఎత్తిపోసి ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. ఉరవకొండ మండలంలో 25 714 ఎకరాలు, పీఏ బీఆర్ ద్వారా కూడేరు మండలంలో 12,185 ఎకరాలు జీడిపల్లి జలాశయం నుంచి బెలుగుప్ప మండలంలో 12605 ఎకరాల కు నీటిని అందించే ఈ బృహత్తర ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి కాకపోవడం వల్ల హంద్రీనీవా కాలువ నీరు రైతుల కళ్ళు ముందే పొలాల మధ్యనే పారుతున్నప్పటికీ ఒక్క ఎకరాకు కూడా వాడుకోలేని పరిస్థితి నెలకొన్నది అన్నారు. ఇలాంటి పరిస్థితులలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించే సామూహిక బిందు సేద్యం ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు పంటలు పండించుకోవచ్చని రైతులు ఎన్నో ఆశలతో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గ కావడంవల్ల ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి లక్షలాది రూపాయలు విలువచేసే డ్రిప్పు పరికరాలు పూర్తిస్థాయిలో సద్వినిగం అయ్యేలా మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి జె. మల్లికార్జున పాల్గొన్నారు.


