Homeఆంధ్రప్రదేశ్పథకం సరే.. అమలులో కూటమి ప్రభుత్వం ముందున్న  పెనుసవాళ్లు

పథకం సరే.. అమలులో కూటమి ప్రభుత్వం ముందున్న  పెనుసవాళ్లు

- Advertisement -

వెంటాడుతున్న సిబ్బంది, బస్సుల కొరత.

 విశాలాంధ్ర,కొవ్వూరు. ఈ నెల 15న కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అటాహాసంగా ప్రారంభించింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్లు ఉండవల్లి నుంచి విజయవాడ బస్ స్టేషన్ వరకు బస్సులో ప్రయాణించారు. ఇ క్కడ వరకు బాగానే ఉంది. కానీ పథకం అమలకు కూటమి ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. అవేమిటో ఒకసారి నిశితంగా పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో తగినంతమంది సిబ్బంది లేకపోవడం, అదే విధంగా రవాణాకు అవసరమైన బస్సులు లేకపోవడం, కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రికల్ బస్సులు రాకపోవడం తదితర సమస్యలు పెను సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయొచ్చు కానీ పైన అనుకున్న మౌలిక సదుపాయాల విషయమై తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఉదాహరణకు రాజమండ్రి ఆర్టీసీ రీజియన్ పరిధిలో నాలుగు డిపాలు ఉన్నాయి. అవి కొవ్వూరు,నిడదవోలు, రాజమండ్రి, గోకవరం డిపోలు ఉన్నాయి. ఈ డిపోలలో మొత్తం 286 బస్సులున్నాయి. ఈ బస్సులు సుమారు 65% వరకు సరిపోతున్న ఇంకా 35 శాతం బస్సులు అవసరం అవుతాయి. అదే విధంగా కండక్టర్లు, డ్రైవర్ల కొరత మరొక ఇబ్బందిగా చెప్పవచ్చు. సిబ్బంది కొరత.. మౌలిక సదుపాయాల ఏర్పాటు దిశలో ఆర్టీసీ అధికారుల కసరత్తు.. ఈ పథకం అమలకు ఆర్టీసీ అధికారులు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వారికి కండక్టర్ విధులు కూడా అప్పచెపుతున్నారు. అదే విధంగా ఆయా డిపోల వారీగా తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేసేందుకుఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన తర్వాత వారికి మూడు రోజుల శిక్షణ అనంతరం ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా నియమిస్తారు. అదే విధంగా ఎక్స్ప్రెస్ సర్వీస్ లో ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచి ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత వెసులుబాటును కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఎక్స్ప్రెస్ సర్వీస్ లో గతంలో 35 సీట్లు ఉండేవి ఇప్పుడు అవి కాస్త 55 సీట్లకు పెంచుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ కొంతమేర తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆదాయ మార్గాలను వెతుకుతూ బిజీగా ఉన్న అధికారులు.. స్త్రీ శక్తి పథకం అమలకు సంవత్సరానికి సుమారు 1500 నుంచి 2000 వరకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుటవలసి ఉంది. దీంతో ఇప్పటివరకు ఆయా డిపాల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చి కొంతమేర అదనపు ఆదాయం పొందవచ్చు అన్నది ప్రభుత్వ, ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రానికి రావలసిన ఎలక్ట్రికల్ బస్సులు కూడా తొందరగా రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు బస్ సర్వీసులు లేకపోవడంతో వారు మండల కేంద్రాలకు చేరుకుని అక్కడ నుంచి ఉచిత ప్రయాణ బస్సులను ఎక్కుతున్నారు. ఈ నేపద్యంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులు వెళ్లేలాగ అధికారులు కృషి చేయాల్సిన అవసరం కానవస్తోంది. 2003 నాటికి సుమారు మూడు వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఆర్టీసీ కార్పొరేషన్ నడిచింది. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించడంతో డిపోల పరిధిలో కొంతమేర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందడంతో తీవ్ర లోటు బడ్జెట్ నుంచి కొంత ఉపశమనం లభించినట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో మరమ్మతులకు గురైన ఆర్టీసీ బస్సులు డిపోలలో మూల పడి ఉన్నాయి. వీటి మరమ్మతులకు కావలసిన విడిభాగాల అవసరతను డిపో మేనేజర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అంతగా స్పందన ఉండేది కాదు. ఇప్పుడు ఈ పథకం అమల తర్వాత బస్సులు నడవడానికి అవసరమైన విడిభాగాలను త్వరగా పంపించే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. లేదంటే సర్వీసులు తగ్గి ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఈ పథకం విజయవంతం చేయడానికి ఆర్టీసీ అధికారులు తీవ్ర కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు