Homeజిల్లాలుఅనంతపురంమెదడులో ఉబ్బిన రక్తనాళానికి ఆపరేషన్ లేకుండానే చికిత్స

మెదడులో ఉబ్బిన రక్తనాళానికి ఆపరేషన్ లేకుండానే చికిత్స

- Advertisement -

విశాలాంధ్ర అనంతపురం టౌన్: మెదడులో ఉబ్బిన రక్తనాళం (బ్రెయిన్ అన్యూరిజం) సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఓ రైతుకు ఎలాంటి ఓపెన్ సర్జరీ చేయకుండా అత్యాధునిక ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ విధానంలో చికిత్స చేసి ప్రాణాలు కాపాడినట్లు కిమ్స్ సవీర వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా. కార్తీక్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. పృథ్వీరాజ్ చికిత్స వివరాలను వెల్లడించారు.తాడిపత్రి ప్రాంతానికి చెందిన రామేశ్వర్ రెడ్డి వ్యవసాయదారుడు. కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలతో కిమ్స్ సవీర ఆస్పత్రికి వచ్చారు. సీటీ స్కాన్, మెదడు రక్తనాళాల ప్రత్యేక పరీక్షలు (సీటీ యాంజియోగ్రామ్) నిర్వహించగా, మెదడులోని ఒక రక్తనాళం ఉబ్బి ఉన్నట్లు (అన్యూరిజం) గుర్తించాం. గతంలో ఇలాంటి సమస్యలకు తలపై శస్త్రచికిత్స (ఓపెన్ బ్రెయిన్ సర్జరీ) చేయడం ప్రధాన చికిత్సగా ఉండేది. అయితే ఇప్పుడు అత్యాధునిక ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ ద్వారా ఎలాంటి పెద్ద కోత లేకుండానే చికిత్స చేశామని వివరించారు. ఈ విధానంలో తొడ భాగంలోని రక్తనాళంలో చిన్న రంధ్రం చేసి, దాని ద్వారా చాలా సన్నని గొట్టం (కాథెటర్)ను రక్తనాళాల గుండా మెదడులోని ఉబ్బిన రక్తనాళం వరకు తీసుకెళ్తారు. అనంతరం ఆ ఉబ్బిన భాగంలో ప్రత్యేకమైన సూక్ష్మ ప్లాటినం కాయిల్స్‌ను ఉంచుతారు. దీంతో ఆ భాగంలోకి రక్తప్రవాహం ఆగిపోతుంది. రక్తనాళం పగిలే ప్రమాదం తగ్గి, రోగి ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. ఈ చికిత్సలో తలకు కోత ఉండదు, శస్త్రచికిత్స అవసరం ఉండదు, నొప్పి తక్కువగా ఉంటుంది. అలాగే రోగి త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి తిరిగి రావచ్చు. అయితే రోగికి చాలా కాలంగా అధిక రక్తపోటు (బీపీ) ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా మందులు వాడడం లేదని వైద్యులు తెలిపారు. నియంత్రణలో లేని బీపీ కారణంగా మెదడులోని బలహీనమైన రక్తనాళాలు ఉబ్బిపోవచ్చు. అవి ఒక్కసారిగా పగిలితే మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, మాట తడబడటం, చేతులు లేదా కాళ్లు పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇలాంటి అత్యాధునిక ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ చికిత్సలు ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండేవని వైద్యులు తెలిపారు. ఇప్పుడు కిమ్స్ సవీరలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో రాయలసీమ ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా అనంతపురంలోనే నాణ్యమైన చికిత్స పొందే అవకాశం కలిగిందన్నారు. సకాలంలో చికిత్స అందడంతో రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు