Homeజిల్లాలువిజయనగరంగ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు

గ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు

- Advertisement -

విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండలం గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు గ్రూప్–2 పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దుర్గారావు విజయం ప్రాంతీయ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. దుర్గారావు తల్లిదండ్రులు తుర్ల అప్పన్న, సూరమ్మలు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పరిమిత ఆదాయం ఉన్నప్పటికీ, తమ కుమారుడు ఉన్నత విద్య సాధించి మంచి స్థాయికి చేరాలన్న లక్ష్యంతో ఎన్నో త్యాగాలు చేస్తూ అతడిని చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయాలను నెరవేర్చినందుకు గర్వంగా ఉందని దుర్గారావు అన్నారు.చిన్న వయస్సు నుంచే చదువుపై ఆసక్తి కలిగిన దుర్గారావు, అనేక అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో చదువును కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా తీసుకొని క్రమశిక్షణతో ప్రిపరేషన్ చేస్తూ గ్రూప్–2 పరీక్షకు సిద్ధమయ్యారు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు.
గ్రూప్–2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడంతో గార్రాజుచీపురుపల్లి గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు, బంధువులు, మిత్రులు దుర్గారావు ఇంటికి చేరుకొని శాలువాలు కప్పి, మిఠాయిలు పంచుతూ ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఆయన విజయం గ్రామానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిందని పలువురు పేర్కొన్నారు.
కష్టపడి చదివితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని దుర్గారావు విజయం నిరూపిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు నిరుత్సాహ పడకుండా లక్ష్యాన్ని నిర్ధారించుకొని ముందుకు సాగాలని దుర్గారావు యువతకు సందేశం ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు