
రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ
విశాలాంధ్ర – రౌతులపూడి : కాకినాడ పార్లమెంట్ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్..కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం, రౌతులపూడి మండలం, రాఘవపట్నం పంచాయతీకి సంబంధించిన సార్లంక గ్రామం (గిరిజన తండా గ్రామం)లో నిన్న సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇంచార్జ్ కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని సతీష్ బాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వ సహాయం అందించేలా, ప్రమాద ప్రదేశానికి వెళ్లి పరిశీలించేలా సూచించారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు సతీష్ బాబు బయలుదేరి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, అధికారులు, కూటమి నాయకులు కలిసి పరిశీలన చేశారు. సతీష్ బాబు ఆధ్వర్యంలో తండావాసుల ఇబ్బందులు విని, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ సహాయంలో రూ.25,000 నగదు, బియ్యం, నిత్యావసరాలు, దుప్పట్లు, టవల్స్, రగ్గులు, వస్త్రాలు అందించారు. కాలిపోయిన ఇళ్లకు కొత్త ఇళ్లు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. గిరిజన తండా గ్రామం కావడంతో మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత దస్తావేజాలు కాలిపోయినవారికి కొత్తవి అందించేలా సతీష్ బాబు ఆదేశించారు. ఎమ్మెల్యే సత్యప్రభ సంఘటన తెలిసిన రాత్రి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని తండావాసులకు ధైర్యం చెప్పారు. ప్రాణనష్టం లేకుండా ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని సతీష్ బాబు తెలిపారు. ప్రభుత్వం తక్షణం భర్తీ చేస్తుందని హామీ ఇచ్చారు. ఇబ్బందులకు ఆఫీస్ ఇంచార్జ్ నంబర్ అందించి, నిరంతర పర్యవేక్షణ ప్రకటించారు.


