బెంబేలెత్తిస్తున్న ఉద్యోగాల కోతలు
. లే ఆఫ్లపై దిగ్గజ కంపెనీల పోటీ
. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ దారిలో మరికొన్ని…
న్యూదిల్లీ : టెక్ రంగంలో ఉద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే నడుస్తోంది. దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటించడం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాదిమందిని తొలగించిన సంస్థలు… తాజాగా కృత్రిమ మేధ(ఏఐ)ను అందిపుచ్చుకునేందుకు మళ్లీ కోతలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే లక్ష మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇచ్చాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్ వంటి ప్రముఖ సంస్థలు ఈ తొలగింపులు చేపట్టాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది అత్యధిక కోతలు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 9,100 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలో కంపెనీ లేఆఫ్‌లు ప్రకటించడం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఆరంభంలో ఒక శాతం మందిని తొలగించిన కంపెనీ… ఆ తర్వాత మే నెలలో 6 వేల మందిని ఇంటికి పంపించింది. జూన్‌లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. తాజాగా, ఎక్స్‌బాక్స్, గేమింగ్ డివిజన్లలో కోతలు పెట్టింది. గతేడాది కూడా ఈ కంపెనీ దాదాపు 10 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ఉన్నారు. ఇక అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ సంస్థ ఇంటెల్ కూడా భారీఎత్తున ఉద్యోగాల కోతలు విధించింది.
కొత్త సీఈఓ నేతృత్వంలో పునర్వ్యవస్థీకరణ చేపట్టిన కంపెనీ… ఇప్పటికే జర్మనీలోని ఆటోమోటివ్ చిప్ యూనిట్‌ను మూసేసింది. అందులోని మొత్తం సిబ్బందిని తొలగించింది. కంపెనీ ప్రధాన కార్యాలయంలోనూ దాదాపు 100 మందిని తీసేసింది. జులై మధ్యలో కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. చిప్ డిజైన్ సీనియర్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్చర్లు, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఉన్నవారిని తొలగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, దిగ్గజ సంస్థ అమెజాన్ కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగుసార్లు తొలగింపులు చేపట్టింది. కమ్యూనికేషన్, సర్వీసెస్, వండరీ పాడ్‌కాస్ట్ విభాగాల్లో ఈ కోతలు విధించింది. రానున్న రోజుల్లోనూ మరింత ఎక్కువగా లేఆఫ్‌లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మేనేజర్ విభాగాల్లో దాదాపు 14 వేల మందిని తొలగించనున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడిరచింది. ఐబీఎం కూడా ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 8 వేల మందిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఎక్కువగా మానవ వనరుల విభాగంలో ఈ కోతలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హెచ్ఆర్ రోల్స్‌లోని దాదాపు 200 మంది ఉద్యోగులను ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసింది. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల 240 మంది ఎంట్రీ లెవల్ ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు ఫిబ్రవరిలోనూ 300 మంది ప్రెషర్స్‌కు లేఆఫ్‌లు ఇచ్చింది. గూగుల్ తన ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. అంతకుముందు క్లౌడ్, హెచ్ఆర్ యూనిట్లలోనూ ఉద్యోగులను తొలగించింది. మెటా ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 3600 మంది ఉద్యోగాలకు కోత పెట్టింది.
పనితీరు బాగాలేదన్న కారణంతో వీరిని తొలగించింది. హెచ్‌పీ తన పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా 2000 మందిని తొలగించింది. టిక్‌టాక్ తన డబ్లిన్ కార్యాలయంలో 300 మందిని ఇంటికి పంపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఐదు నెలల్లో రెండుసార్లు కోతలు ప్రకటించింది. వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. సేల్స్‌ఫోర్స్, బ్లూఆర్జిన్ సంస్థలు 1000 మంది చొప్పున తొలగించింది. సైమన్స్ గ్రూప్ తన ఆటోమేషన్, ఈవీ చార్జింగ్ యూనిట్లలో దాదాపు 5,600 మందిని ఇంటికి పంపించింది. ఇవేగాక, ఆటోమేటిక్, కాన్వా, మ్యాచ్‌గ్రూప్, క్రౌడ్ స్ట్రైక్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ వంటి సంస్థల్లోనూ తొలగింపులు కొనసాగుతున్నాయి.


