. 20 నెలలుగా ఉద్యోగుల పడిగాపులు
. డీఏ, ఐఆర్ చెల్లింపుల్లో జాప్యం
. రూ.40 వేల కోట్ల బకాయిలు
. విడుదల చేసింది అరకొరే…
. భారీగా అప్పులు తెస్తున్న సర్కారు
. ఉద్యోగులకు మాత్రం ‘గుండు సున్నా’
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఈసారి కూడా సంక్రాంతి పండుగ ఆనందం దూరమవుతోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన తొమ్మిది హామీల అమలులో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్, డీఏ బకాయిలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) చైర్మన్‌ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారన్న ఆశతో గత సంక్రాంతి నుంచే ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో సంక్రాంతి వచ్చినా ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సంక్రాంతి పండుగలు గడిచాయి. అంతకుముందు దసరా, దీపావళి పండుగలు వచ్చి వెళ్లాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం కూడా గడిచిపోయాయి. అయినప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల కోర్కెలు మాత్రం అలాగే నిలిచిపోయాయి. ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలిచే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఈ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తోంది. ఆ నిధులతో అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. కానీ ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందన్న విమర్శలున్నాయి. ఈ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు తరచూ ప్రభుత్వానికి వినతులు అందజేసినా, సీఎం చంద్రబాబు నుంచి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరకు అందరి నోట వినిపిస్తున్న ఒకే మాట, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నది. ఆ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది? ఉద్యోగుల కోరికలు ఎప్పుడు నెరవేరుతాయి? అంటూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఎన్నికల హామీలు అమలేదీ?
ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తోందొకటని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల్లో నిశ్శబ్ద విప్లవం మొదలైందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తవగా… ఇక పాలనకు మిగిలింది కేవలం 40 నెలలే. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యవధి మరింత తగ్గే అవకాశముంది. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి ప్రభుత్వం వరకు ఉద్యోగులకు వివిధ రూపాల్లో రావాల్సిన నిధులు పేరుకుపోతూనే ఉన్నాయి. అయితే వాటి విడుదల విషయంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు సుమారు రూ.40 వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఇందులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.25 వేల కోట్లు ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక మరో రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ బకాయిల్లో ప్రధానంగా డీఏలు, ఐఆర్, సరెండర్ లీవులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన నిధులు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ డబ్బులు ఇప్పటికీ రావాల్సి ఉంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలే సుమారు రూ.17 వేల కోట్ల వరకు ఉంటే, ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూ.7,300 కోట్లనే చెల్లించింది. తాజాగా మరో రూ.1,100 కోట్ల విడుదల చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉంటుందనే ప్రశ్నను ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్నాయి. ఇంకా రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు మిగిలి ఉన్నాయని పేర్కొంటున్నాయి. 2024 డిసెంబరు వరకు పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించగా, 2024 ఏప్రిల్ వరకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి దాదాపు 20 నెలలుగా గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సేవలో ఉన్న ఉద్యోగులకు నాలుగు సరెండర్ లీవులు, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు ఇవ్వాల్సి ఉంది. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఈ బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతికి రూ.1,110 కోట్లు విడుదల చేస్తే అది ఏ మూలకు సరిపోతుందని ఉద్యోగ సంఘాలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి.
కొత్త పీఆర్సీ ఎప్పుడు?
ప్రభుత్వం నూతన పీఆర్సీ చైర్మన్‌ను ఇప్పటివరకు నియమించలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ చైర్మన్‌ను నియమించగా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. నూతన పీఆర్సీని 2023 జూన్‌లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 11వ పీఆర్సీ హయాంలోనే రూ.7,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా వాటిపై ఎలాంటి ప్రస్తావన కూడా లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. నూతన పీఆర్సీ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతులు అందజేసిన ప్రతిసారీ ఆర్థిక పరిస్థితి పేరిట వాటిని పక్కన పెడుతుండటంతో ఉద్యోగులు, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ చైర్మన్‌ను ఏర్పాటు చేయకుండా ఉద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మరో నాలుగు డీఏలు పెండిరగ్‌లో ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ కొన్ని నెలలకే పరిమితమై, ప్రస్తుతం 10వ తేదీ వరకు వేతనాలు జమ అవుతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులకు రావాల్సిన బకా యిలు చెల్లించకపోగా, వారిపై వేధింపులు కొనసా గుతున్నాయని, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను ఇంటింటా తిరిగేలా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉపాధ్యాయులను యాప్‌లు, బోధనేతర పనులతో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. సీపీఎస్, జీపీఎస్ వ్యవస్థలపై సమీక్ష చేసి. మధ్యే మార్గంలో మరో విధానం తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇతర వర్గాల మాదిరిగానే తమకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


