Homeతెలంగాణఖరీఫ్ కల్లా యూరియా యాప్

ఖరీఫ్ కల్లా యూరియా యాప్

- Advertisement -

. కేంద్ర ప్రాయోజిత పథకాలు వథా కానివ్వొద్దు
. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం

విశాలాంధ్ర-హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా (ఫెర్టిలైజర్) యాప్ అందుబాటులో తేవాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఉద్యానవన శాఖల పురోగతిపై వ్యవసాయశాఖ సెక్రటరి, ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం, తెలంగాణ విజన్`2047 కార్యాచరణ ప్రణాళికలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు రైతులకు పూర్తిస్థాయిలో చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… యూరియా యాప్ తేవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎరువులశాఖ అభినందించిందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా ఈ యాప్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తేవాలన్నారు.
రాష్ట్రంలో ఆర్గానిక్ పంటలు పండిస్తున్నప్పటికి, మార్కెట్లో నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో నకిలీ ఉత్పత్తులు చలామణీ అవుతున్నందున నిజమైన ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు నష్టం చేకూరుతుందని మంత్రి అన్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఒక యాప్ తీసుకురానుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా కొనుగోలుదారు తాను కొనబోయే ఉత్పత్తి ఎక్కడ, ఏ రైతు, ఎలా పండించాడో తెలుసుకుంటాడని అన్నారు. అదేవిధంగా అగ్రివర్సిటీలలోని ఖాళీ ప్రదేశాలలో ఆర్గానిక్ పంటలు పండించి, అక్కడే స్టాల్స్ పెట్టి అమ్మినట్లైతే రైతులు ఆర్గానిక్ పంటలవైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా 50 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రైతులకు కావాల్సిన యంత్రాలు మార్కెట్ ధరలకే లభించేలా, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా రైతులకు చేరేలా నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పట్టించుకోని కేంద్ర ప్రాయోజిత పథకాలను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆదేశాలనుసారం ఒకొక్కటిగా పునరుద్ధరిస్తోందని, అందులో భాగంగా ఈ సంవత్సరం వివిధ పథకాల కింద ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని, ఒక్క పైసా కూడా వృథాగా తిరిగి వెళ్లకూడదని అధికారులకు సూచించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పెద్దమొత్తంలో యూరియా బఫర్ స్టాక్ లను నిల్వలో ఉంచుకోవాలని, భవిష్యత్తులో యూరియా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, రైల్వే రేక్ పాయింట్లను కూడా ఎరువుల పంపిణీకి తగ్గట్లుగా ఉండేలా, మరికొన్ని రైల్వే రేక్ పాయింట్లను అదనంగా ఏర్పాటు చేసేవిధంగా రైల్వే అధికారులను కోరాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాలకు బోనస్ ఇస్తున్నందున, పంటకాలనికి అనుగుణంగా వ్యవసాయశాఖ ద్వారా సన్న వడ్లలో మేలైన వంగడాలను సూచించాలని, రైతులు అట్టి రకాలను ఉత్పత్తి చేసి మంచిధర పొందేటట్లు చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల డిపాజిట్లు ప్రైవేట్ కమర్షియల్ బ్యాంకులలో కాకుండా కో-ఆపరేటివ్ , అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకులలో చేసేలా చూడాలని…అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ లో కేంద్రం ఇచ్చిన లక్ష్యానికి రెట్టింపు ప్లాంటేషన్ జరిగేలా అధికారులు పనిచేయాలని మంత్రి అన్నారు. పామ్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 44 శాతానికి పెంచినట్లైతే టన్ను ఆయిల్ పామ్ ధర 25000 వరకు చేరుకుంటుందని, దాంతో రైతులకు కూడా ఆయిల్ పామ్ పంట వేయలనే ఆసక్తి పెరుగుతుందన్నారు. రాష్ట్ర అవసరాల కోసం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. డిమాండ్ కు తగ్గట్టుగా కూరగాయల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగులో విజయవంతం అయిన రైతులను రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ఇతర రైతులతో మాట్లాడించాలన్నారు. గ్రామాలలోనే కాకుండా పట్టణాలలో కూడా అందుబాటులో ఉన్న స్థలాలలో , టెర్రస్ ల మీద కూరగాయలు పండించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకోసం డిపార్ట్ మెంట్లలో గాని, యూనివర్సిటీలలో గాని కార్పోరేషన్లలో గాని ఏర్పాటు చేసే ప్రతి కమిటీలలో అధికారులతో పాటు రైతులు ప్రాతినిధ్యం వహించేలా కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డిపార్ట్ మెంట్లకు సంబంధించి ఉన్న ఖాళీ ప్రదేశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి అయి మిగిలిన కరెంట్ ను గ్రిడ్ కు అమ్ముకోవచ్చని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రెండు రైతువేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయగా, నెలకు 400 యూనిట్ల వరకు మిగులు కరెంట్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హర్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, హాకా.ఎండి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు