. రహదారులపై సంక్రాంతి రద్దీ
. చీమలదండులా వాహనాలు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఊరూరా సంక్రాంతి సందడి నెలకొంది. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగకు వివిధ ప్రాంతాల్లో నివసించే వారితో పాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ ఏర్పడిరది. నాలుగైదు రోజులుగా పల్లెలు, పట్టణాలు కళకళలాడుతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. జాతీయ రహదారులను వాహనాల వరద ముంచెత్తుతోంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ, చెన్నై-విశాఖ జాతీయ రహదారుల్లో కార్లు వేల సంఖ్యలో చీమలదండులా పరుగెడుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి వేల సంఖ్యలో తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. మూడు నాలుగు రోజులుగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు అనేక అసౌకర్యాలకు గురవుతున్నారు. టోల్ గేట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరుతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణకు కీలకమైన ప్రాంతాల్లో పోలీస్ బలగాలను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ అనేక చోట్ల ట్రాఫిక్ స్థంభించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు, రాజమండ్రి, విశాఖ, కాకినాడ ప్రాంతాలకు వెళ్లే వాహనాలను విజయవాడ నగరంలో ప్రవేశించకుండా గొల్లపూడి నుంచి బైపాస్ రోడ్ మీదుగా నేరుగా చినఅవుటపల్లికి మళ్లించారు. ఫలితంగా విజయవాడ మీదుగా వాహనాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తగ్గాయి. కీసర నుంచి ఏలూరు వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లే రద్దీని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా డ్రోన్ కెమెరాల సహాయంతో పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ప్రత్యేక కారుల ద్వారా కుటుంబ సమేతంగా ప్రజలు ఊరుబాట పట్టారు. హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లకు ప్రయాణికులు తరలివచ్చి… అక్కడ నుంచి పల్లె బాట పడుతున్నారు.


