Homeపారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్

పారిశ్రామిక ప్రగతి వేదిక దావోస్

- Advertisement -

. ఆయా రంగాల్లో మార్పులు, ఆలోచనలు పంచుకునే అవకాశం
. చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
. ముగిసిన 4 రోజుల పర్యటన`నేడు హైదరాబాద్ రాక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటనలో నిర్వహించిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో గ్రౌండ్ అయ్యాయని సీఎం వెల్లడించారు. దావోస్‌లో చివరిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు. దావోస్ పర్యటనపై ఎలా ఉందంటూ ముఖ్యమంత్రిని చంద్రశేఖరన్ అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు స్పందిస్తూ…మూడు రోజులు నిర్వహించిన వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ కంపెనీలు మరింత ఆసక్తి చూపుతున్నాయని సీఎం అన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, అనుకూల విధానాల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్‌లో కంపెనీల స్థాపనకు విస్తృత అవకాశాలు పెరిగాయని సీఎం అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను ముఖ్యమంత్రితో చంద్రశేఖరన్ పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, కర్నూలులో ప్రతిపాదించిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేకంగా టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖరన్ తెలిపారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపడుతున్న టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని టాటా గ్రూపును సీఎం కోరారు. రాష్ట్రంలో టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగా… వాటన్నింటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకారం అందిస్తామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు.
నాలుగు రోజులు…36కు పైగా సమావేశాలు
నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు స్వదేశానికి బయల్దేరారు. శుక్రవారం ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళతారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఇజ్రాయిల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో మూడు సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిత్తల్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తొమ్మిదికి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు దోహదం చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో యూరప్‌లోని తెలుగు ప్రజలతో మమేకమవుతూ తెలుగు డయాస్పోరా ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. దావోస్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వూలు ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు