. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి
. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్
విశాలాంధ్ర-హైదరాబాద్: మిషన్ మోడ్‌లో పని చేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్ప్పుడు గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని, అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దన్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతీ అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో గోడౌన్ల సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అలాంటి ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను తీసుకుని ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడ నుంచి గోడౌన్లకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పోలీసు సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలాచూడాలని సూచించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్ప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపించాలని సీఎం ఆదేశించారు.
అకాల నష్టం తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థ
అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాల సమయంలో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్ప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ప్రతి రైస్ మిల్లు వద్ద బాధ్యతాయుతమైన అధికారిని నియమించి, పర్యవేక్షించాలని ఆదేశిం చారు. ధాన్యం లోడింగ్‌లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని తెలిపారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత తీసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లాల్లో ఎక్కడ సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందిస్తుందని తెలిపారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: మంత్రి తుమ్మల
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంత మంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు ధాన్యం తీసుకురాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


