భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం భారత్ విధించే సుంకాలను 25 శాతం నుంచి ఏడు శాతం తగ్గించి కేవలం 18 శాతం సుంకాలు అమెరికా నుంచి వసూలు చేస్తారట. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకూడదట. అమెరికా, వెనిజులా నుంచే చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించడం ఈ ఒప్పందంలోని మరో చీకటి కోణం. వెనిజులా మీద అమెరికా పెత్తనం కొనసాగుతోంది కనక అక్కడి నుంచి దిగుమతి చేసుకునే చమురు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి సమానమే. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సుంకాలు ఏమీ తగ్గించదు. ఈ దిగుమతుల్లో జన్యు మార్పిడి చేసిన సోయ, మొక్కజొన్న కూడా ఉంటాయి. ఈ సుంకాలలో మార్పు రైతులకు మేలు చేస్తుందని మోదీ ప్రభుత్వం మరో పచ్చి అబద్ధం చెప్తోంది. నిజానికి ఇది మన రైతాంగానికి, పరిశ్రమలకు, వ్యాపారులకు కూడా విపరీతమైన నష్టం కలిగిస్తుంది. వ్యవసాయ రంగ ఉత్పత్తులకు సైతం అమెరికాకు ద్వారాలు బార్లా తెరుస్తారు. ఇది సామ్రాజ్యవాదానికి మోకరిల్లడమే. మరీ విచిత్రం ఏమిటంటే ఈ విషయం గురించి అమెరికా నుంచి ప్రకటన వెలువడింది తప్ప మన దేశం నుంచి కాదు. ఆపరేషన్ సిందూర్ తానే ఆపించానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించారు.
అంటే మన యుద్ధనీతి, విదేశాంగ విధానాన్ని కూడా అమెరికాయే నిర్ణయిస్తుందనుకోవాలి. ట్రంప్ ప్రకటన అసత్యమని చెప్పే ధైర్యం మోదీ సర్కారు ఇప్పటిదాకా చూపనే లేదు. పైగా మోదీ అభ్యర్థన మేరకే ఈ వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ అంటున్నారు. అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం రైతులకు ఓ చీకటి రోజు. దీని దుష్ప్రభావం రైతులకే పరిమితం కాదు. దేశ ప్రజలందరూ అధిక ధరలు భరించవలసి వస్తుంది. మోదీ మొహం చూడడానికే ఇష్టపడని ట్రంప్ ఈ ఒప్పందం కుదిరినట్టు చెప్పినప్పుడు ప్రియమైన మోదీ అని సంబోధించారు. అమెరికాకు ప్రయోజనం కలిగేటప్పుడు అమాంతం మోదీ అత్యంత ప్రియమైన వ్యక్తి అయిపోతారు. మోదీ మురిసిపోయారు. ఇది మోదీ నిస్సిగ్గుగా ట్రంప్‌కు దాసోహం అనడమే. వెనిజులాలో ముడి చమురు నిలవలు అపారంగా ఉన్న మాట నిజమే. కానీ దాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. దీన్ని భరించడానికి మోదీ ప్రభుత్వం అంగీకరించడం మన ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. మోదీ ఎన్ని ప్రగల్భాలు పలికినా వ్యవసాయంపై ఆధారపడిన దాదాపు 70-80 కోట్ల మంది జనం వెన్నులో బాకు దించడమే. మనం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం భారం మోయాల్సి వస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ ఒప్పందం గురించి పార్లమెంటుకు మాటమాత్రంగానైనా చెప్పకపోవడం అంటే మోదీకి పార్లమెంటు అంటే ఎంత తృణీకారభావన ఉందో తేలిపోతోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువు మీద అయినా ఒక్క రూపాయి సుంకం అయినా ఉండదంటే పత్తి, గోధుమలు లాంటివాటి పైనా సుంకాలేవీ విధించకుండా ఉండడానికి మోదీ సర్కారు నోటికి తాళం వేసుకుని అంగీకరించింది. ఒక వేళ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వ్యవసాయోత్పత్తులు చౌకగా వస్తాయనుకున్నా దీని పిండితార్థం ఏమిటంటే భారత రైతుల నుంచి ప్రభుత్వం కొనడం తగ్గిపోతుంది. ఇది మన రైతుల నడ్డి విరవడమే. మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఉపసంహరించి మహోపకారం చేశామంటున్న మోదీ ఇక అమెరికా దోపిడీకి సకల అవకాశాలు కల్పిస్తారన్న మాట. దీనివల్ల అమెరికా రైతులకు అపారమైన లాభం ఉంటుందని అమెరికా వ్యవసాయ మంత్రి బ్రుక్ రోలిన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారంటే ప్రయోజనం ఎవరికో చెప్పక్కర్లేదు. ఈ ఒప్పందం గురించి మోదీ సర్కారు దాదాపు ఏడాది నుంచి దండోరా వేస్తూనే ఉంది. కానీ ఈ ఒప్పందం గురించి మోదీ నోరు తెరవకపోవడం దారుణాతి దారుణం. కానీ భక్తులు మోదీ కీర్తిగానంలో మునిగి తేలుతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించే భారత్-అమెరికా మధ్య వివాదాలు ఉండేవి. ఇవి పరిష్కారం అయిపోయినట్టేనా ? కానే కాదు. వ్యవసాయరంగ ద్వారాలు అమెరికా కోసం తెరిస్తే మన రైతాంగం పై కచ్చితంగా ప్రతికూల ప్రభావం ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో భారతీయ రైతులు అంటే తనకు ఎంత ప్రీతిపాత్రులో అని బోర విరుచుకుని చెప్పిన విషయాన్ని మోదీ మరిచిపోయినట్టున్నారు. ఈ ప్రసంగం ఆయన మన మీద అమెరికా 50 శాతం సుంకం విధించిన తరవాత చేశారు. మా ప్రభుత్వానికి రైతుల హితంపై అత్యధిక ప్రాధాన్యం ఉంది అని గొప్పలు చెప్పుకున్నారు. రైతులు, పశుపాలకులు, మత్స్య కార్మికుల ప్రయోజనాల విషయంలో ఎన్నడూ రాజీ పడబోమని మోదీ ఆ ప్రసంగంలో గొంతు చించుకుని మరీ చెప్పారు. రాజీ పడ్తే తనకు వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని అయితే తాను దీనికి సిద్ధంగా ఉన్నానని మోదీ అప్పుడు సెలవిచ్చారు. ఇప్పుడు మోదీ ప్రకటన చూస్తే మోదీ రాజీ పడడమే కాదు ఎలా దాసోహం అన్నారో అర్థం అవుతోంది. ఈ ఒప్పందం వల్ల రైతులే మూల్యం చెల్లించవలసి వస్తుందనడం వాస్తవం.
సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో అమెరికా నుంచి ఈ ఒప్పందం గురించి ప్రకటన వస్తే అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో మన వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆనందం వ్యక్తం చేశారు. దీని భావమేమిటో ! ఆ ప్రకటనలో ఆయన రైతుల ప్రస్తావనే తీసుకురాలేదు. శివరాజ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసిన నాలుగైదు గంటల తరవాత, మంగళవారం ఉదయం అయిదున్నరకు అమెరికా వ్యవసాయ మంత్రి బ్రుక్ రోలిన్స్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు అమెరికా రైతులకు అపారమైన మేలు జరుగుతుందని ట్వీట్ చేశారు. ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో మన రైతులకు ఒరిగేది మాత్రం శూన్యం. అమెరికా మార్కెట్ల కోసం మన రైతుల కడుపు కొడ్తున్నారు. స్వావలంబన గురించి గొంతు చించుకోవడం తప్ప మోదీ చేసేది ఏమీ ఉండదు. మనకు చిరకాల మిత్రదేశమైన, ఆపత్కాలంలో మనకు అండగా నిలబడ్డ రష్యాతో చమురు దిగుమతి నిలిపివేయడానికి ఒప్పుకోవడం అంటే నికార్సైన మిత్రదోహమే. స్వాతంత్య్రోద్యమ కాలంలో బీజేపీకి పూర్వరూపమైన భారతీయ జన సంఘ్ బ్రిటీìష్ వారికి ఊడిగం చేసిన బీజేపీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించడం వ్యర్థం.
అమెరికాకు మోదీ దాసోహం
- Advertisement -


