Wednesday, February 18, 2026
Homeసంపాదకీయంఅసలు గురి యోగీ మీదే

అసలు గురి యోగీ మీదే

- Advertisement -

మౌని అమావాస్య రోజు మాఘస్నానానికి వెళ్తున్న జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి పై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడి చేసినంత పనిచేశారు. దాదాపు 200మంది అనుయాయులతో కలిసి అవిముక్తేశ్వరానంద మాఘ స్నానానికి బయలుదేరారు. మరోవైపు నుంచి మరో బృందం వచ్చింది. రెండు బృందాలూ ఎదురుబొదురుగా తారసపడ్డారు. రెండు బృందాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగిన దాఖలాలైతే కనిపించలేదు. కానీ అప్పుడే అవిముక్తేశ్వరానంద పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. శంకరాచార్య అనుయాయులను అటూఇటూ తోసేయడమే కాదు, కొందరిని నేలమీంచి ఈడ్చుకెళ్లారు. అవిముక్తేశ్వరానందను పల్లకి మీంచి దించేశారు. ఆయన అక్కడే బైఠాయించారు. బీజేపీ హిందుత్వ రాజకీయాలను అమలుచేస్తుంది. కాని విద్వేషం కేవలం ముస్లింలు, క్రైస్తవుల వంటి మైనారిటీ వర్గాల మీదేకాకుండా శంకరాచార్య మీదే ప్రయోగించారు. అవిముక్తేశ్వరానంద చాలా సందర్భాలలో మోదీ ప్రభుత్వాన్ని ఒకింత తీవ్రంగానే విమర్శించారు. కాని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దుర్వర్తనకు అదొక్కటే కారణం అయినట్టుగా లేదు. ఇతరేతర కారణాలు ఉండొచ్చునన్న అనుమానం కలుగుతోంది. వివిధ శంకరాచార్య పీఠాల అధిపతులు అప్ప్పుడప్ప్పుడూ రాజకీయ విమర్శలు చేయడం కొత్త కాదు. వీరు పార్టీల వారీగా విడిపోయిన దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి. అవిముక్తేశ్వరానంద మీద యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కాస్తా అసలు హిందువులు ఎవరు అన్న చర్చకు కూడా తెరలేపింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవిముక్తేశ్వరానంద యోగీ ప్రభుత్వం అనుసరించిన విధానం బీజేపీలో ఉన్న పొరపొచ్చాలతో ముడివడి ఉందని భావించే వారూ ఉన్నారు. యోగీ ఆదిత్యనాథ్ ఆర్.ఎస్.ఎస్. కుదురు నుంచి వచ్చిన వారు కాదు. తాను సన్యాసిని అని చెప్పుకుంటారు. పోలీసులు అడ్డƒగించగానే అవిముక్తేశ్వరానంద ధర్నా ప్రారంభించారు. యోగీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు..విచిత్రం ఏమిటంటే యోగీ ప్రభుత్వం అవిముక్తేశ్వరానంద అసలు శంకరాచార్యే కాదు అన్న వాదన లేవ దీసింది.24గంటలలోగా మీరు శంకరాచార్య అని నిరూపించుకోవాలని నోటీసు కూడా జారీ చేసింది. శంకరాచార్య కూడా యోగీ ఆదిత్యనాథ్‌కు ఓ నోటీసు పంపించారు. హిందూమతంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే పీఠాధిపతి అవిముక్తేశ్వరానందకు, గోరఖ్‌నాథ్ పీఠాధిపతిగా పనిచేసిన యోగీ ఆదిత్యనాథ్‌కు మధ్య విభేదాలే శంకరాచార్య విషయంలో దురుసు ప్రవర్తనకు కారణం అంటున్న వారూ ఉన్నారు. వీరిద్దరూ హిందూ మత ప్రచారానికి కట్టుబడ్డవారే. యోగీ ఆదిత్యనాథ్ అయితే మోదీ, అమిత్‌షా కన్నా పెద్ద హిందుత్వవాదినని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందులో గమనించవలసిన ప్రధానాంశం ఏమిటంటే అవిముక్తేశ్వరానంద ప్రధానంగా యోగీ మీదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మోదీ జోలికి వెళ్లడం లేదు. ఎప్పటిలాగే తీవ్ర వివాదాలు, సమస్యలు తలెత్తినప్పుడు కూడా మౌనంగా ఉండే మోదీ ఇప్పుడూ మౌనముద్రలోనే ఉన్నారు. బీజేపీలో భిన్నాభిప్రాయాలే కాదు అంతర్గత కలహాలు కూడా ఉన్నాయనడానికి తాజా ఉదాహరణే ఇది. బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన నితిన్ నవీన్ ఆ పదవిని చేపట్టిన సందర్భంలో మోదీ వేదిక మీద వస్తున్నప్పటి దృశ్యం కేంద్ర ప్రభుత్వానికి యోగీ ఆదిత్యనాథ్‌కు మధ్య ఉన్న తగువులకు ప్రబల నిదర్శనంగా భావించవచ్చు. నితిన్ నవీన్ పదవీ స్వీకార సమయంలో మోదీ వేదిక మీదకు వచ్చినప్పుడు అక్కడ బీజేపీ అధికారంలో ఉన్న కొందరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అందులో యోగీ సైతం కనిపిస్తున్నారు. మోదీ వేదిక మీదకు వస్తున్నప్పుడు యోగీ తప్ప మిగతా ముఖ్యమంత్రులు అందరూ చేతులు జోడించి మోదీకి నమస్కరించారు. కానీ యోగీ ఆ పని చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మోదీకి, అమిత్‌షాకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి మధ్య పెరుగుతున్న దూరానికి ఇది సంకేతం. మరో సంఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. ఓ విమానాశ్రయంలో మోదీ ముందు కారులో వెళ్తూ ఉంటే ఆ వెనకే యోగీ కాలినడకన వెళ్తున్నారు. అంటే యోగీ ఆదిత్యనాథ్‌ను మోదీ తన కారులో కూర్చోపెట్టుకోలేదు.ఇది కూడా వారి మధ్య అంత సఖ్యత లేదనడానికి నిదర్శనమే.2012లో స్వరూపానంద మరణం తరవాత అవిముక్తేశ్వరానంద జ్యోతిర్మఠ పీఠాధిపతి అయ్యారు. అది స్వరూపానంద సమ్మతితోనే జరిగింది. సాధారణంగా పీఠాధిపతులు తమ ఉత్తరాధికారిని నియమిస్తూ ఉంటారు. ఈ నియామకాన్ని అఖాడ పరిషద్ వ్యతిరేకించింది. స్వరూపానంద కూడా బీజేపీని వ్యతిరేకించేవారు. అవిముక్తేశ్వరానంద ఇదే మార్గంలో నడుస్తున్నారనుకోవాలి. స్వరూపానంద కాంగ్రెస్‌కు దగ్గరగా ఉండేవారు. సాధువులు, సంతులు కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోయారు. కొందరిని ప్రభుత్వం అంగీకరిస్తుంది. మరికొంతమంది పీఠాధిపతులను ప్రభుత్వం అంగీకరించదు. బీజేపీ హయాంలో అయితే ఈ విభజన రేఖలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉండే సాధువుల్లో బాబా రాందేవ్, శ్రీశ్రీ రవిశంకర్, రామభద్రాచార్య లాంటి వారు ఉన్నారు. బాబా రాంరహీం కూడా ఈ జాబితాలోకే వస్తారు. అత్యాచారాలు, హత్యల ఆరోపణపై రాంరహీం జైలుకెళ్లారు. ఆయనకు శిక్ష పడింది. కానీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితుడు కనక ఇప్పటికి కనీసం 16సార్లు పెరోల్ మీద విడుదలయ్యారు. ఆయన ప్రభావం ఉన్న ప్రాంతాలలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఆయనకు పెరోల్ మంజూరు చేస్తూ ఉంటుంది. హరిద్వార్‌లో ఒక సాధు సమ్మేళనంలో బీజేపీకి దగ్గరగా ఉన్న యతి నర్సింగానంద ముస్లింలను తిట్టిపోశారు. ఆయన బీజేపీకి సన్నిహితుడు కనక ఆయన మీద ఏ చర్యా తీసుకోలేదు. బీజేపీకి అనుకూలమైన సాధుసంతులకు అనేక విషయాల్లో ప్రభుత్వం నుంచి మద్దతూ సమకూరుతుంది. బీజేపీ హిందుత్వ ప్రచారం కోసం వీరిని వినియోగిస్తూ ఉంటారు. శ్రీశ్రీ రవిశంకర్ భూ-ఆక్రమణకు పాల్పడ్డారన్న విషయం బయట పడినప్పుడు ఆయన మీద కేసు కూడా దాఖలైంది. కానీ ఇప్పుడు ఏ విచారణా జరగకుండా నిలిచిపోయింది. బీజేపీలో రెండు మూడు బృందాలు ఉన్నట్టున్నాయి. మణికర్ణిక ఘాట్‌లో జరిగిన సంఘటనలు, అక్కడ అహల్యా హోల్కర్ ప్రతిమ ఒడ్డు మీద పడి ఉండడం కూడా ఈ మధ్య చర్చకు వచ్చింది. ఇది కృత్రిమమేధ సష్టి అని అధికారపక్షం వాదిస్తోంది. కానీ అది నిజం కాదనడానికి అనేక రుజువులున్నాయి. అవిముక్తేశ్వరానంద వ్యవహారం ప్రభుత్వం ఒళ్లో కూర్చునే మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రచారంలో యోగీ ఆదిత్యనాథ్‌ను విలన్‌గా చిత్రించే ప్రయత్నం సాగుతోంది. కేంద్రం మౌనంగా ఉండడాన్ని చూస్తే యోగీని ఒంటరిగా వదిలేసినట్టు స్పష్టం అవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు