Homeఇండియాకు క్వాంటం కేంద్రం ఏపీయే

ఇండియాకు క్వాంటం కేంద్రం ఏపీయే

- Advertisement -

. ఏఐలో కొత్త ఆవిష్కరణలకు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌
. లాజిస్టిక్స్‌, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు అనుకూలం
. దుబాయ్‌లో సీఎం చంద్రబాబు
. యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌తౌక్‌ అల్‌ మర్రీతో భేటీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారత దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతిలో ఏర్పాటు అవుతుందని, సాంకేతికరంగంతోపాటు, లాజిస్టిక్స్‌, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏపీ అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతమని సీఎం వివరించారు. యూఏఈ పర్యటనలో భాగంగా మూడోరోజు దుబాయ్‌లో యూఏఈ ఆర్ధిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. యూఏఈ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై చర్చించారు. సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్‌ ద్వారా ఇచ్చిపుచ్చుకునేలా, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఈ ప్రాంతాన్ని నాలెడ్జ్‌ ఎకానమీగా ప్రోత్సహించే దిశగా దుబాయ్‌ సిలికాన్‌ ఓయాసియా తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. అలాగే ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకుయూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి అంగీకరించారు. అనంతరం దుబాయ్‌ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌ లోని తెలుగు ప్రజలతో డయాస్పోరా కార్యక్రమానికి సీఎం చంద్రబాబు
హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్‌ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌, ఓమన్‌, బహ్రెయిన్‌, ఖతార్‌ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు. దుబాయ్‌ లోని లీ మెరిడియన్‌ హోటల్‌ లో అత్యంత ఉత్సాహ భరితంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతికి తిరుగే లేదని, ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్‌ 1 గా తయారవుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించాను. ఆవిధంగానే తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వ్యక్తి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీఈఓగా ఉన్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారని, మీ కృషిని ఎన్నటికీ మరువలేనని వారికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్‌ దేశాల నుంచి మీరు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోంది. అబుదాబీ, దుబాయ్‌ ఆయిల్‌ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. దాదాపు 1.50 లక్షల హోటల్‌ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది. మనం ఏఐ, క్వాంటం వ్యాలీపై దృష్టి సారించాం. ్న గతంలో హైదరాబాద్‌ కు మైక్రోసాఫ్ట్‌ తీసుకువస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్‌ తీసుకువచ్చాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సప్‌ ద్వారా ఇప్పటికే 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నాం. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో గూగుల్‌ విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ కానుందని చంద్రబాబు చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా అగ్రగామిగా ఉండాలని, అలాగే స్వంత రాష్ట్రాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు