Tuesday, July 15, 2025
Homeసంపాదకీయంక్వాడ్‌లోనూ చుక్కెదురే

క్వాడ్‌లోనూ చుక్కెదురే

ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మోదీ ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఈ విషయంలో కూడా ప్రపంచ దేశాల మద్దతు సంపాదించడంలో విఫలమైంది. మంగళ వారం వాషింగ్టన్‌లో ‘‘క్వాడ్‌’’ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశం తరవాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో మన దేశంపైకి పాకిస్థాన్‌ తీవ్రవాదులను ఉసి గొల్పుతోంది అన్న మాట చేర్పించడంలో విఫలమైంది. పాకిస్థాన్‌ మాట ఎత్తకుండానే తీవ్రవాదాన్ని ఖండిరచారు. క్వాడ్‌ దేశాలలో పాకిస్థాన్‌ లేకపోయినా ఆ దేశం పేరెత్తడానికి నిరాకరించారు. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్‌, అమెరికా దేశాలు కలిసి ‘‘క్వాడ్‌’’ ఏర్పాటు చేసుకున్నాయి. భారత పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగించడం, ప్రాంతీయ భద్రతపై దృష్టి పెట్టడం, ఆర్థిక సహకారం, ఉమ్మడి ప్రయోజనాలు కాపాడు కోవడం ఈ నాలుగు దేశాల కూడలి లక్ష్యం. ప్రాంతీయ భద్రత అన్న అంశం కూడా ఈ దేశాల కార్యక్రమ ప్రణాళికలో ఉంది కనక దాదాపు 35 ఏళ్లుగా భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడాన్ని ఖండిరచడానికి ఈ కూటమి నిరాకరించింది. తీవ్ర వాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్థాన్‌ పాత్ర ఈ సంయుక్త ప్రకటనలో చేర్పించడం కుదరలేదు. ఇది ఒక రకంగా అంతర్జాతీ యంగా మనం ఎంత ఏకాకులమైపోయామో రుజువు చేస్తోంది. పహల్గాంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని హత మార్చినప్పుడు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న దేశాలు తప్ప దాదాపు అన్ని దేశాలూ ఖండిరచాయి. కానీ నోటి మాటకే పరిమితమైనాయి. మనకు అండగా నిలబడ్డ దేశం ఒక్కటి కూడా మిగలలేదు. వచ్చే నవంబర్‌లో క్వాడ్‌ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం మన దేశంలో జరగవలసి ఉంది. తీవ్రవాదాన్ని నిరసించడంలో క్వాడ్‌ దేశాలు వెనకాడలేదు. కానీ మన దేశం మీదకు తీవ్రవాదులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌ పేరెత్తడానికి మాత్రం వెనుకాడాయి. తీవ్రవాద కార్యకలాపాలను, దాని బహురూపాలను, సరిహద్దు ఆవలి నుంచి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఖండిస్తున్నామని ఈ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడాన్ని కూడా సమర్థిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్‌ పేరు చేర్చాలన్న భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ప్రతిపాదనను మాత్రం అంగీకరించలేదు. గత ఏప్రిల్‌ 22న పహల్గాంలో తీవ్రవాదుల దాడిని ఖండిరచారు. మృతుల కుటుంబాలకు సానుభూతి కూడా తెలియ జేశారు. కానీ ఈ దాడులను ప్రేరేపించిన పాకిస్థాన్‌ పేరెత్తడానికి మాత్రం జంకారు. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానం కూడా ఇదే రీతిలో ఉంది. ఐక్యరాజ్య సమితి అమెరికా అదుపాజ్ఞలకు పరిమితమై నడుచుకుంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
క్వాడ్‌ సంయుక్త ప్రకటనలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం తీవ్రవాదాన్ని ఖండిరచాలని చెప్పారే తప్ప పాకిస్థాన్‌ పేరెత్తలేదు. దీనికి ఓ కారణం ఉండి ఉంటుంది. క్వాడ్‌ కూటమిలో అమెరికా కూడా ఉంది. ఇటీవల ఇరాన్‌ మీద ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా యుద్ధం చేసిన సమయంలో అమెరికా ఇరాన్‌ లోని అణు స్థావరాల మీద దాడి చేసింది. పాకిస్థాన్‌ పేరెత్తితే మరి అమెరికా పేరు కూడా ఎత్తాలిగా. పైగా ఈ తీర్మాన ముసాయిదా తయారు చేసింది కూడా అమెరికానే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు అశాశ్వత సభ్యత్వం ఉంది. శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా మద్దతూ ఉంది. 2019లో పుల్వామా దాడిని ఖండిస్తూ తీర్మానం ఆమోదించినప్పుడు భారత్‌ పేరెత్తారు. పైగా పాకిస్థాన్‌లోని జైష్‌-ఎ-మహమ్మద్‌, లష్కర్‌-ఎ-తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల పేర్లు నేరుగా ప్రస్తావించారు. ఇప్పుడు క్వాడ్‌ సంయుక్త ప్రకటనలో మాత్రం భారత్‌ పేరు కూడా ఎత్త లేదు. ‘‘సంబంధిత అధికారులు’’ అని మాత్రమే అన్నారు. పహలగాం ఘాతుకంలో లష్కర్‌-ఎ-తోయిబా ప్రత్యక్ష హస్తం ఉందని జై శంకర్‌ వాదించినా వినే నాథుడే కనిపించలేదు. ఈ పరిస్థితికి అమెరికా పాకిస్థాన్‌ పక్షపాతమే ప్రధాన కారణం. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణకు తానే కారకుడినని ట్రంప్‌ పదే పదే చెప్పుకున్నారు. ఈ మాటను మోదీ ప్రభుత్వం ఇప్పటిదాకా బాహాటంగా ఖండిరచనే లేదు. ఆపరేషన్‌ సిందూర్‌ తరవాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాకిస్థాన్‌ సైన్యాధిపతి ఫీల్డ్‌ మార్షల్‌ అసీం మునీర్‌ను ఆహ్వానించి విందు చేశారు. ఇలాంటి చేష్టలతో అమెరికా మొగ్గు కచ్చితంగా పాకిస్థాన్‌ వేపే అని తేలిపోతూనే ఉంది. నిజానికి ఏ క్లిష్ట సమయంలోనూ అమెరికా మనకు అండగా నిలబడిన సందర్భమే లేదు. ఆపరేషన్‌ సిందూర్‌కు అంతర్జాతీయ మద్దతు సమీకరించడంలో విఫలమైనందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో సమాచారం వెల్లడిరచడానికి మోదీ ఇప్పటికీ నిరాకరిస్తూనే ఉన్నారు. వైమానిక దళాధిపతి, త్రివిధ దళాల అధిపతి మాత్రం ఆపరేషన్‌ సిందూర్‌ గురించి ప్రస్తావించారు. పైగా అమెరికా ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌ను భారత్‌తో సమానంగా ప్రస్తావిస్తోంది. రెండు దేశాల మధ్య అన్ని రంగాలలో భారత్‌ ఆధిక్యాన్ని నిరాకరిస్తోంది. క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభం కావడానికి ముందు కూడా జై శంకర్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కొనే హక్కు మనకు ఉంది అని చెప్పారు. తీవ్రవాదాన్ని ప్రపంచ దేశాలు అసలే సహించకూడదని కూడా చెప్పారు. దాడి చేసే వారిని, దాడికి గురయ్యే వారిని ఒకే గాటకట్టకూడదనీ అన్నారు. క్వాడ్‌ దేశాలు ఈ విషయం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను సంయుక్త ప్రకటన జారీ చేసేటప్పుడు బొత్తిగా పట్టించుకోలేదు. కథ అక్కడితో ముగియ లేదు. మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమెరికా రక్షణ మంత్రి హెగెత్‌ తో సంభాషించినప్పుడు కూడా ‘‘పాకిస్థాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం’’ అన్న మాటలను పరిహరించారు. ముందు ఈ మాటలు ఉండేవి. కానీ తరవాత తొలగించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌ ప్రేరేపిత తీవ్రవాదం అనడం దూరదర్శన్‌లో కూడా ప్రసారమైంది. ఆ తరవాత తొలగించవలసి రావడం నిజానికి సిగ్గుచేటు. భారత-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఏక పక్షంగా మార్చకూడదని క్వాడ్‌ విదేశాంగ మంత్రులు అన్నారు. ఈ మాట చైనాను ఉద్దేశించిందే కావొచ్చు. కానీ పాకిస్థాన్‌ మీద చర్య తీసుకోవడానికి తమకు హక్కు ఉంది అని మోదీ అన్న మాటలకూ వర్తిస్తుంది. క్వాడ్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడినప్పుడు జై శంకర్‌ ప్రధానమంత్రి మోదీ మోదీ మాటలనే చిలకపలుకుల్లా అప్పగించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు