Homeపేదలకు సబ్సిడీ సరకు అందేనా?

పేదలకు సబ్సిడీ సరకు అందేనా?

- Advertisement -
  • సీఎం ఆదేశాలపై అలసత్వం
  • ఇంకా రేషన్ షాపులకు చేరని నిల్వలు
  • ‘దీపావళికి కానుక’ అంటూ గొప్పలు చెబుతున్న ప్రభుత్వం
  • డీలర్ల హెచ్చరికలతో గందరగోళంలో కార్డుదారులు

విశాలాంధ్ర-సచివాలయం:
రాష్ట్రంలో ఒకవైపు వరుస తుపాన్ల కారణంగా వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిని…మరోవైపు బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి నడ్డివిరుస్తున్న వేళ.. ప్రభుత్వం ప్రకటించిన ‘దీపావళి పండుగ కానుక’ల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాబోయే పండుగ నాటికి రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరలకు కందిపప్పు, పామాయిల్, గోదుమపిండి అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, టెండర్ల గోప్యత, రేషన్ డీలర్ల ఆర్థిక ఆందోళనలు చూస్తుంటే ఈ కానుకలు నిజంగానే సమయానికి పేదల ఇళ్లకు అందుతాయా, అనే అనుమానాలు తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు, పౌరసరఫరాల శాఖ క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మందకొడి తీరుకు మధ్య ఎక్కడా పొంతన కుదరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.150 దాటిన కందిపప్పును ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రూ.100 కే అందిస్తామని ప్రకటించగా, నాలుగేళ్ల తర్వాత ఈ పథకాన్ని పునరుద్ధరిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన టెండర్ల వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా, బయట మార్కెట్‌లో లీటరు రూ.150కి పైగా ఉన్న పామాయిల్ను మూడేళ్ల విరామం తర్వాత రూ.125 సబ్సిడీ ధరకు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా…దుకాణాలకు స్టాక్ చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బయట రూ.45 నుండి రూ.50 వరకు పలుకుతున్న గోదుమపిండిని రూ.25 కే ఇస్తామంటున్నప్పటికీ కేంద్రం ఇచ్చే గోదుమలను పిండిగా మార్చి ప్యాకింగ్ చేసే ప్రక్రియలో తీవ్ర అలసత్వం కనిపిస్తోంది. మరోవైపు, బయట రూ.60కి పైగా ఉన్న పంచదారను కార్డుదారులకు రూ.34 కే అందిస్తున్నప్పటికీ నెలకు కేవలం అరకిలో మాత్రమే ఇవ్వడం సామాన్యుడి కుటుంబానికి ఏ మూలకు సరిపోదనే నిరాశ వ్యక్తమవుతోంది. ఇక మార్కెట్‌లో రూ.60 పైనే ఉన్న ఉల్లిపాయలను రైతు బజార్లలో రూ.35 కే విక్రయిస్తున్నట్లు చెబుతున్నా…ఆ సదుపాయం కేవలం పట్టణ రైతు బజార్లకే పరిమితం కావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ తక్కువ ధరల ఫలాలు దక్కని వైనం స్పష్టమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు సబ్సిడీ ధరలకు కందిపప్పు పంపిణీని నిలిపివేయగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రేటు రూ.100 లోపే ఉండటంతో ఈ పథకాన్ని పున రుద్ధరించలేదు. అయితే అంతర్జాతీయంగా, దేశీ యంగా ఎల్‌నినో ప్రభావం వల్ల కంది పంట దెబ్బతినడంతో మార్కెట్‌లో కందిపప్పు ధర ఏకంగా కిలో రూ.150 దాటింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కేంద్రాన్ని 1.20 లక్షల టన్నుల కందులు కేటాయించాలని కోరగా, కేంద్రం అందుకు అంగీకరించింది. కేంద్రం కేటాయించిన కందులను మిల్లింగ్ చేయించి… పప్పుగా మార్చి కిలో ప్యాకింగ్ల ద్వారా పంపిణీ చేసేందుకు గత నెల 26న టెండర్లు పిలిచి 28తో ముగించారు. అయితే ఈ టెండర్ ఎవరికి దక్కింది? ఏ ధరకు ఖరారైంది? అనే విషయాన్ని పౌరసరఫరాల సంస్థ అత్యంత గోప్యంగా ఉంచడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. గతంలో సబ్సిడీపై రూ.67కే విక్రయిం చిన కందిపప్పును, ఇప్పుడు ఏకంగా రూ.100కు పెంచి కార్డుదారులకు అమ్మాలని నిర్ణయించడంపై సామాన్యుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోం ది. ‘సబ్సిడీ’ పేరుతో ప్రభుత్వమే రేట్లు పెంచి విక్ర యించడం ఎంతవరకు సమంజసమని వినియోగ దారులు ప్రశ్నిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లీటరు పామాయిల్ ధర రూ.150కి పైగా ఉండి సామాన్యుడి బడ్జెట్‌ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కార్డు దారులకు లీటరు పామాయిల్ రూ.125కే పంపిణీ చేయాలని నిర్ణయించడం కొంత ఊరట కలిగించే విషయమే. టెండర్ల ద్వారా సేకరించి సరఫరా చేయాలని పౌరసరఫరాల సంస్థ భావిస్తున్నప్పటికీ, పండుగ సమీపించడంతో ఈలోగా సరుకు రేషన్ షాపులకు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా కేంద్రం ఇచ్చే గోదుమలను పిండిగా మార్చి, ప్యాకింగ్ రూపంలో కిలో రూ.25కు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నా… మిల్లింగ్, ప్యాకింగ్ కేంద్రాల వద్ద పనులు నెమ్మదిగా సాగుతుండటంతో దీపావళి నాటికి కార్డుదారుల చేతికి ఇవి అందడం కష్టమేన్న ప్రచారం జరుగుతోంది.
డీలర్లపై పెట్టుబడి భారం
ఒకవైపు ప్రభుత్వం పండుగ నాటికి సరుకులు అందించేందుకు ప్రణాళికలు రచిస్తుంటే, మరోవైపు రేషన్ డీలర్లు మాత్రం సరుకులు ఎత్తేందుకు నిరాకరిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. కందిపప్పు, పామాయిల్ స్టాక్ ఎత్తడానికి ప్రతీ షాపు నిర్వాహకుడు ముందస్తుగా సుమారు రూ.1 లక్ష వరకు సొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, ఇప్పటికే కమీషన్‌లు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమపై ఈ స్థాయిలో భారం మోపడం అన్యాయమని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వమే తమకు సరుకులను అప్పు కింద ఇవ్వాలని, లేదా గతంలో కంటే కమీషన్ భారీగా పెంచి ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీలర్ల డిమాండ్లను పరిష్కరించకుండా బలవంతంగా సరుకులు అంటిస్తే దుకాణాలు తెరిచేది లేదని, అవసరమైతే పంపిణీని పూర్తిగా స్తంభించిపోయేలా సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. డీలర్ల ఈ మొండివైఖరి, అధికారుల అలసత్వం పంపిణీ వ్యవస్థకు గండంగా మారింది.
రైతు బజార్లకే పరిమితమైన ధరల కట్టడి
బహిరంగ మార్కెట్‌లో బియ్యం, ఉల్లిపాయల ధరలు మంట పుట్టిస్తుండటంతో ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా సన్న రకాల బియ్యం (బీపీటీ కిలో రూ.49, కేఎన్‌ఏం రకం రూ.51) విక్రయిస్తోంది. బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో చర్చలు జరిపి బీపీటీ స్టీమ్ బియ్యం రూ.66, సాధారణ స్టీమ్ బియ్యం రూ.47 మించకుండా అమ్మేలా ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో వ్యాపారులు అధిక ధరలకే విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో రూ.60కి పైగా ఉన్న ఉల్లిపాయలను రైతు బజార్లలో ప్రస్తుతం కిలో రూ.35కే విక్రయిస్తున్నారు. అదనంగా మరొక 800 టన్నుల ఉల్లిని తక్కువ ధరకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ధరల నియంత్రణ చర్యలు, పప్పులు-నూనెల సబ్సిడీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.100 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఈ ఫలాలు రైతు బజార్లు ఉన్న పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు