- 31,460 పోలింగ్ కేంద్రాలు – 2.61 కోట్ల మంది ఓటర్లు
- ఎంపీటీసీల బరిలో 18,843 మంది
- జెడ్పీ బరిలో 2,169 మంది అభ్యర్థులు
- భారీ బందోబస్తు… సీసీటీవీ, వీడియోగ్రఫీతో నిఘా
- భారీవర్షాలు, స్థానిక పరిస్థితులపై ఎస్ఈసీ సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : స్థానిక సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగాల్సిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అవ సరమైన అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తం గా 31,640 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2.61లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 స్థానాలు ఏకగ్రీవమ య్యాయి. మిగిలిన 7,770 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, ఈ స్థానాల్లో మొత్తం 18,843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో తలపడుతున్నారు. అలాగే మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాల్లో ఇప్పటికే 77 ఏకగ్రీవం కాగా, మిగిలిన స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, మొత్తం 16,064 కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్తు, సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేశారు. నవంబర్ 7వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.వాతావరణ పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించినట్లు తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డా. ఏ. మల్లిఖార్జున మాట్లాడుతూ..లి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో సుమారు 2,52,000 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బంది కొరత తలెత్తకుండా అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం సుమారు 52,000 మంది సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపల మాల్‌ప్రాక్టీస్ లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న పక్షంలో ప్రిసైడింగ్ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోనల్ మేజిస్ట్రేట్ లేదా పోలీసు అధికారులను సంప్రదించి పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకురావాలని సూచించారు.


