విద్యుత్ నిల్వ వ్యవస్థలకు రూ.14,500 కోట్లు
కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌కు రూ.2,814 కోట్లు
గణాంక వ్యవస్థ ఆధునికీకరణకు రూ.4,371 కోట్లు
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియమితులైన అగ్నివీరుల పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ధి, కీలక ఖనిజాల ప్రాసెసింగ్, గణాంక వ్యవస్థ ఆధునికీకరణ, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల కొనసాగింపునకు ఆమోదం తెలిపింది. దేశాభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతం, న్యాయ వ్యవస్థలో సమరÆత, సత్వర న్యాయం అందించే విధానాలు దిశగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ వ్యవస్థల అభివృద్ధికి కేంద్రం రూ.14,500 కోట్లతో ‘వయబిలిటీ గ్యాప్ ఫండింగ్’ పథకాన్ని ఆమోదించింది. తద్వార 92 గిగావాట్ అవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయనున్నారు. సాయుధ దళాల్లో సేవలను కొనసాగించడానికి అగ్నివీరులందరికీ రెండేళ్ల వెసులుబాటు కల్పిస్తున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు మోదీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం నాలుగేళ్లుగా ఉన్న పదవీకాలం ఆరేళ్లు అవుతుందని, డిసెంబర్ 31న త్రివిధ దళాల నుంచి 18 వేల అగ్నివీరులు బయటకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నివీరుల పనితీరు ఆధారంగా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అగ్నివీరులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలు అందించిన తర్వాత… వారి ప్రతిభ, సంస్థాగత అవసరాల ఆధారంగా 25శాతం మంది మాత్రమే శాశ్వత నియామకానికి అర్హత పొందుతారు. మిగిలిన వారు పౌర ఉద్యోగాలలో చేరేలా ఆర్థిక ప్యాకేజీ, నైపుణ్య ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. కాగా, కేబినెట్ తాజా నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో స్థిరత్వం పెంచడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతున్నట్లు తెలిపారు. లిథియం, నికెల్ వంటి కీలక ఖనిజాల దేశీయ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించేందుకు రూ.2,814 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. బ్యాటరీలు, విద్యుత్ వాహనాల తయారీకి అవసరమైన ఖనిజాల విషయంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యమని వెల్లడించారు. దేశ గణాంక వ్యవస్థను ఆధునికీకరించేందుకు 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలు చేసే విస్తార్ పథకానికి రూ.4,371.10 కోట్లు కేటాయించిందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగంతోపాటు 59 ప్రధాన సర్వేలు, ఎనిమిదో ఆర్థిక గణన నిర్వహణ చేపట్టనున్నారు. అత్యాచారం, పోక్సో కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. ఇందుకోసం రూ.3,788 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా 850 ప్రత్యేక కోర్టుల ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.


