ఓ పక్క కరవు, మరోపక్క తుపాన్లతో తీవ్ర నష్టం
- వ్యవసాయరంగానికి ‘వీబీజీ రామ్ జీ’
- కరవు కార్డుల జారీ, జేజేఎం విస్తరణకు సహకరించాలి
- సత్వరం పంటల బీమా పరిహారం
- కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేలా కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించాలని, ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల అంచనా కోసం వివిధ జిల్లాల్లో పర్యటించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. ఈనెల 2, 3 తేదీల్లో రెండు బృందాలుగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించిన సభ్యులు తమ కరవు అధ్యయన వివరాలు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని తీర ప్రాంతం తుపాన్ల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో కారణంగా రాయలసీమ సహా ఇంకొన్ని ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ బృందానికి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలపై స్పష్టత లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఐఎంసీటీ సభ్యులకు తెలిపారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసం సమస్యలు కూడా తలెత్తాయని వివరించారు. అనంతపురం జిల్లాలో దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైన పరిస్థితిని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లో 412 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లో కరవు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక కూడా సమర్పిస్తామని సీఎం చెప్పారు.
వీబీజీరామ్జీని వ్యవసాయానికి వర్తింపజేసి… పనిదినాలు 200 రోజులకు పెంచాలి
ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో వీబీ జీ రామ్ జీ పథకం కింద కనీస పనిదినాలను 200 రోజులకు పెంచి, వ్యవసాయ రంగానికి అవసరమైన పనులకు ఈ పథకాన్ని వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని కేంద్ర బృందాన్ని కోరారు. దీంతో రైతులకు మానవ వనరుల సమస్య తీరడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కరవు పరిస్థితుల వల్ల రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోతోందని, వ్యవసాయ రుణాల చెల్లింపులపై కూడా ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి వివరించారు. గతంలో రాయలసీమలో పది ఎకరాల భూమి ఉన్న రైతులకు సైతం కరవు పరిస్థితుల దృష్ట్యా రేషన్ కార్డులు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన కరువు బాధిత కుటుంబాలకు డ్రాట్ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీంతో కేంద్ర సహకారంతో నిత్యావసర సరుకుల ధరలు సబ్సిడీపై అందించే వీలుంటుందని చెప్పారు. అలాగే, రైతులకు రుణాల రీషెడ్యూలింగ్ వంటి ఉపశమన చర్యలు అందేలా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జేజేఎం విస్తరణతో జల వనరుల బలోపేతం
డ్రాట్ కార్డుల జారీతోపాటు, జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకాన్ని మరింత విస్తరించిఊ సమరÆ నీటి నిర్వహణ పనులకు కేంద్రం సహకరించాలని కోరారు. కరవు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, పంటల బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన రైతుల ఖాతాల్లో పరిహారం జమయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. రైతులకు సకాలంలో పరిహారం అందితే తదుపరి పంటల సాగుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని వివరించారు. కరవు ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాకుండా పశుసంపద, గ్రామీణ జీవనోపాధిపై కూడా పడుతున్నందున పశుగ్రాసం, తాగునీటి సరఫరా వంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనగా, మరోవైపు వరుస తుపాన్ల కారణంగా పంటలు, ఇతర రంగాలకు నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విభిన్న ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా స్పందించి తగిన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


