కష్టకాలంలో బంగారం అమ్మడం, కాస్త నాలుగు డబ్బులు వెనకేయగలిగాం అనుకున్నప్పుడు బంగారం కొనడం అన్ని కుటుంబాలూ అనుసరించే విధానమే. కానీ ప్రభుత్వమే బంగారం నిలవలు అమ్మడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందనడానికి చిహ్నం. దాదాపు రెండు వారాల సమయంలో మే నెలలో భారత ప్రభుత్వం లక్షా 14వేల కోట్ల బంగారం అమ్మి ఉండవచ్చునన్న వార్తలు నిన్నటి నుంచి గుప్పుమంటున్నాయి. బ్లూంబర్గ్ వార్తాసంస్థ ఈ రహస్యం బయటపెట్టింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇది బూటకపు వార్త అంటోంది. బంగారం నిలవల గురించి రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదిక ఆధారంగా బ్లూంబర్గ్ మోదీ ప్రభుత్వం బంగారం అమ్మి ఉండొచ్చునని తెలియజేసింది. అయితే రిజర్వు బ్యాంకు, భారత పత్రికా సమాచార వ్యవస్థ (పి.ఐ.బి.) బ్లూంబర్గ్ బయటపెట్టిన రహస్యాన్ని తీవ్రంగా ఖండించాయి. మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో విదేశీ మారక ద్రవ్య నిలవల్లో సమతుల్యత సాధించడం కోసం బంగారం అమ్మి ఉండవచ్చునని బ్లూంబర్గ్ అంచనా వేసింది. బంగారం అమ్మి 7.5బిలియన్ డాలర్ల విదేశీ ఆస్తులు కొన్నారంటున్నారు. గత మార్చి ఆఖరు నాటికి మన దేశంలో 880.52మెట్రిక్ టన్నుల బంగారం నిలవలు ఉండే వంటున్నారు. దీనిలో 77శాతం నిలవలు మన దేశంలోనే ఉండే వంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన మాట వాస్తవం. రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే వంద దాటుతుందేమోనన్న భయాందోళన ఆవహించింది. బంగారం అమ్మిన తరవాత మంగళవారం రూపాయి మారకం విలువ 95.17కు చేరింది. అంటే రూపాయి విలువ పతనాన్ని నిలవరించడానికి ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకుందని అర్థం. రూపాయి విలువ పతనం ఆపడానికి మన ఆర్థిక వ్యవస్థలో భారీ సానుకూల మార్పులు ఏమీ లేవు. మన దగ్గర ఉన్న బంగారం నిలవల్లో ఆరు నెలల కిందట 66 శాతం మన దేశంలోనే ఉండేవి. మన బంగారం నిలవల్లో ఎక్కువ భాగం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దగ్గర ఉండేవి. మన బంగారం నిలవలు ఏ మేరకు ఉన్నాయో రిజర్వు బ్యాంకు నెల వారీగా విడుదల చేసే నివేదికల్లో తెలియజేస్తుంది. ఈ వివరాలు మారలేదు కనక ప్రభుత్వం బంగారం అమ్మేసిందనడం నిజం కాదు అని ప్రభుత్వ వర్గాలు సమర్థిస్తున్నాయి. ఇందులో నిజా నిజాల మీమాంస పక్కన పెట్టినా మోదీ ప్రభుత్వం నిజం చెప్తుందన్న నమ్మకం లేదు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆధారంగా మనం నాల్గో స్థానంలో ఉన్నామని ప్రభుత్వ గణాంకాలు చెప్తూ ఉంటే వాస్తవానికి మనం ఆరో స్థానంలోకో, ఏడో స్థానంలోకో దిగజారిపోయాం. విదేశీ పెట్టుబడిదార్లు నిరంతరం మన దేశం నుంచి పెట్టుబడులు ఉప సంహరిస్తూనే ఉన్నారు. ప్రతి గంటకు 400కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయంటున్నారు. మన దేశం నుంచి తరలించుకుపోయే పెట్టుబడుల్ని తైవాన్, కొరియా మార్కెట్లో పెట్టుబడి పెడ్తున్నారు. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోదీ బూటక ప్రతిష్టను కాపాడడానికి బంగారం అమ్మడం లాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కనిపిస్తోంది. రూపాయి విలువ వంద స్థాయి దాటకుండా నివారించడం కోసమే బంగారం నిలవలను అమ్మేశారంటున్నారు. రూపాయి విలువ నిరంతరం పతనావస్థలో ఉండడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, పరిశ్రమలు మూత పడడం, ఉపాధి అవకాశాలు మరీమరీ సన్నగిల్లడం మొదలైనవన్నీ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత సంకట స్థితిలో ఉంది అనడానికి సంకేతాలో. వీటిల్లో ఏ ఒక్క అంశం విషయంలోనూ మన పరిస్థితి మెరుగైన దాఖలాలు లేవు.
అలాంటప్పుడు రూపాయి విలువ మంగళవారం 95.17కు చేరిందంటే ఏవో ఒక దిద్దుబాటు చర్యలు చేపట్టినందు వల్లే అనుకోవాల్సి వస్తోంది. అదే బంగారం అమ్మడం కావొచ్చు. బంగారం అమ్మేశామని ప్రభుత్వం అంగీకరించనూ లేదు. నికరంగా ఖండించనూ లేదు. మనం ఏ సరుకులు దిగుమతులు చేసుకోవాలన్నా విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర దండిగా ఉండాలి. కొరతల్లా దానిదే. అందుకే కొద్ది రోజుల కింద బంగారం కొనకండి, విదేశీ యాత్రలు మానుకోండి, దుబారా తగ్గించండి. పెట్రోల్, డీసెల్ వినియోగాన్ని తగ్గించండి అని హితవు పలికారు. ఈ నియమాలను ఆయనే పాటించలేదనడం వేరే విషయం. తన కాన్వాయ్‌ని రెండు కార్లకు పరిమితం చేశానని మోదీ చెప్తున్నారు. ఇదీ వాస్తవంగా ఉన్నట్టు లేదు. మంత్రులు, ప్రముఖులు తమ వాహన శ్రేణిలో కోత పెట్టిన దాఖలాలే లేవు. ఎంత పెద్ద కాన్వాయి ఉంటే అంత ప్రముఖుడి కింద లెక్క. బంగారం ధర పెరుగుతూ ఉంటే మన దగ్గరున్న బంగారం విలువ పెరుగుతూ ఉండాలి. కానీ తగ్గడం అంటే ఎక్కడో గందరగోళం ఉన్నట్టు లెక్క. అంటే బంగారం నిలవలు తగ్గుతున్నట్టే. బంగారం నిలవలు తగ్గిన స్థితిలో 7.5 అరబ్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిలవలు ఉన్నాయి అంటే బంగారం అమ్మి విదేశీ మారక ద్రవ్య నిలవలను కాపాడే ప్రయత్నం జరిగినట్టే. పెరగాల్సిన చోట తగ్గడం, తగ్గాల్సిన చోట పెరగడం అంటే బంగారం అమ్మి ఉంటారు అని అంచనా వేయడంలో తప్పు లేదు. బంగారం నిలవలు తగ్గలేదు అని నమ్మించడానికి రిజర్వు బ్యాంకు తాజా గణాంకాలు కాకుండా ఏప్రిల్ 26 నాటి గణాంకాలు ఇచ్చింది. అంటే ఏదో దాస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లూంబర్గ్ నివేదిక మే నెల నాటిది. అందులో బంగారం నిలవలు తగ్గినట్టే ఉన్నాయి. అంటే మేలోనే బంగారం అమ్మి ఉండాలి. మే నెల లెక్కలను రిజర్వు బ్యాంకు వెల్లడిస్తే తప్ప, అందులో బంగారం నిలవలు తగ్గకుండా ఉంటే తప్ప బంగారం అమ్మలేదు అని నమ్మడం కుదరదు. బంగారం అమ్మలేదు అని రిజర్వు బ్యాంకు చెప్పదలచు కుంటే మే నెల గణాంకాలు ఇవ్వాల్సింది. మే నెలలో బంగారం అమ్మారు అన్న ఆరోపణలు ఎదురవుతున్న స్థితిలో ఏప్రిల్‌లోని గణాంకాలు చూపడం అంటే ఏదో మాయ చేస్తున్నట్టే. బంగారం అమ్మి విదేశీ మారక ద్రవ్యం కొని విదేశీ మారక ద్రవ్య నిలవలు బాగానే ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ మెడలోని మంగళ సూత్రాలు కూడా లాగేస్తారు అని మోదీ బెదరగొట్టారు. ఇప్పుడు ప్రభుత్వమే బంగారం నిలవలు తెగనమ్మి విదేశీ మారక ద్రవ్య నిలవలు ఉన్నాయని చెప్పడం అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పతనావస్థలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగారం అమ్మడమే నిజమైతే మన ఆర్థిక వ్యవస్థ జారుడు బండ చివరి అంచులో ఉన్నట్టే. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నప్పుడు మన బంగారం తాకట్టు పెడ్తేనే నానా గగ్గోలు చెలరేగింది.
బంగారం తెగనమ్ముతున్న మోదీ?
- Advertisement -


