Tuesday, July 15, 2025
Homeసంపాదకీయంమర్యాద తప్పిన ఎన్నికల కమిషన్‌

మర్యాద తప్పిన ఎన్నికల కమిషన్‌

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల కమిషన్‌ కొత్త ఆట మొదలుపెట్టినట్టు ఉంది. బీహార్‌ ప్రజల్లో చాలా మంది ఉపాధి కోసం అనేక రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఇంతకు ముందు ఉన్నప్పటికీ మళ్లీ వారు తాము భారత పౌరులమేనని రుజువు చేసే పత్రాలు దాఖలు చేయాలట. అంటే పొట్టకూటి కోసం ప్రవాసం వెళ్లిన బీహార్‌ పేద ప్రజలు హుటాహుటిన సొంత రాష్ట్రం వెళ్లి ఓట్లర్ల జాబితాలో తమ పేరు నమోదు చేయించుకోక తప్పనట్టు కనిపిస్తోంది. ఓటు పౌరుల హక్కు. కానీ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన బీహారీలు తమ గ్రామాలకు వెళ్లి ఎన్నికల కమిషన్‌ అడిగే పత్రాలను సమర్పించి తాము భారత పౌరులమేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. పొరపాటున ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా ఓటు వేసే హక్కు కోల్పోయినట్టే. ఈ అంశాలన్ని చర్చించడానికి ప్రతిపక్షాల బృందం ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి వెళ్లింది. కానీ ఈ సమావేశం ఏ లెక్కన చూసినా సౌహార్ద్ర పూరితంగా జరగలేదు. బుధవారం ప్రతిపక్ష నాయకులు వచ్చే ముందు రోజే ఎన్నికల కమిషన్‌ ముందు అక్కడ ఏదో నిరసన ప్రదర్శన జరుగుతోందా అన్న రీతిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాట్లు చూస్తేనే ఎన్నికల కమిషన్‌ ఏదో మతలబు చేస్తోందనిపిస్తోంది. నోట్‌ బందీలాగా ఓట్‌ బందీ చేస్తున్నట్టుగా ఉంది. బీహార్‌ నుంచి వలస వెళ్లిన ఓటర్లు మొత్తం ఓటర్లలో కనీసం 20 శాతం ఉన్నారు. అంటే ఇలాంటి వారు దాదాపు రెండు కోట్ల దాకా ఉంటారు. వారు పరుగుపరుగున వచ్చి తమ ఓటును ఖాయం చేసుకోకపోతే వారు ఓటర్లు కాకుండా పోతారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన బీహారీల్లో చాలా మంది ఓటర్లే. కానీ వారి హక్కు పునరుద్ధరించుకోకపోతే ఓటు వేయడం కుదరక పోవచ్చు. ఎన్నికల కమిషన్‌ నిర్వాకంవల్ల చాలా మంది ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. 11 ప్రతిపక్షాలకు చెందిన 18 మంది నాయకులు ఎన్నికల కమిషన్‌ అధికారులతో చర్చించారు. కానీ వారి ముఖాలన్ని కళ తప్పి ఉన్నాయి. అంటే వీరి మాట ఎన్నికల కమిషన్‌ వినిపించుకున్నట్టు లేదు. ఇది కొత్త ఎన్నికల కమిషన్‌ అనీ తమ వ్యవహారం ఇలాగే ఉంటుందన్న రీతిలో ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రతిపక్ష నేతల మొహం మీదే చెప్పేశారు. పైగా తాము పార్టీ అధినేతలైన వారితోనే మాట్లాడతామని కూడా ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌ అధిపతులను కలుసుకోవడం కొత్త కాదు. ఇది ఇంతకు ముందు నుంచే జరుగుతూ ఉంది. కానీ బుధవారం ఎన్నికల కమిషన్‌తో సమావేశమైన ప్రతిపక్ష నేతలు విచారగ్రస్థులుగా కనిపించారు. గత పదకొండేళ్ల నుంచి ఎన్నికల కమిషన్‌ మోదీ ప్రభుత్వ అదుపాజ్ఞల్లో నడుస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్‌తో సమావేశం సౌహార్ద్ర పూరితంగా జరగలేదని ప్రతిపక్షాలు ఎందుకు భావిస్తున్నాయి? ప్రతిపక్ష నాయకులకు తమతో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ వారిని సుమారు 45 నిముషాల సేపు లోపలికి పిలవనే లేదు. 22 మంది వెళ్తే 18 మందినే లోపలికి అనుమతించారు. ఏ ప్రతిపక్ష నేతలు తమతో మాట్లాడవచ్చో కూడా ఎన్నికల కమిషన్‌ అధిపతులే నిర్ణయిస్తారన్న మాట. జై రాం రమేశ్‌ దశాబ్దాలుగా పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్నారు. మంత్రిగా కూడా పని చేశారు. కానీ ఆయనను ఎన్నికల కమిషన్‌ రానివ్వలేదు. అసలు ముందు ప్రతిపక్ష నేతలతో మాట్లాడడానికే జ్ఞానేశ్‌ కుమార్‌ గుప్తా నాయకత్వంలోని ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. తీవ్ర ఒత్తిడి తరవాత ఒప్పుకున్నారు. కానీ ఎంత మంది రావాలో అందులో ఎవరెవరు ఉండాలో కూడా కమిషన్‌ అధిపతులే నిర్ణయించారు. దీన్నిబట్టి ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ నిర్దేశాల ప్రకారం కాకుండా మోదీ ఆదేశాల ప్రకారమే పని చేస్తోందని తేలిపోతోంది. ప్రతిపక్షాలను ఖాతరు చేయకుండా ఉండడమే మోదీ నైజం. నిజానికి రాజకీయ నాయకులతో మాట్లాడడానికి ఎన్నికల కమిషన్‌ తన ఇష్టానుసారం నిబంధనలు రూపొందించడానికి అవకాశమే లేదు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు మాత్రమే రావాలన్న నిబంధనతో ప్రతిపక్షాల అధికారాన్ని ఏ లెక్కన పరిమితం చేస్తున్నట్టో! అన్ని పక్షాల అనుమానాలను తీర్చడం ఎన్నికల కమిషన్‌ బాధ్యత. అదే జరగడం లేదు. ఇది ప్రతిపక్షాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ప్రజలందరూ ఆలోచించవలసిన అంశం. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, దాపరికం లేని రీతిలో పని చేయడం లేదని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ సారి ఎన్నికల కమిషన్‌ సర్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రతిపక్ష నాయకులతో అమర్యాదకరంగా వ్యవహరించింది.
2003లో బీహార్‌లో ఓటర్ల జాబితా సవరించారు. అంటే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు సవరణ జరిగింది. ఆ తరవాత రెండేళ్లకు బీహార్‌ శాసన సభ ఎన్నికలు జరిగాయి. వచ్చే నవంబర్‌ రెండో వారంలోగా బీహార్‌ శాసన సభ ఎన్నికలు జరగాలి. ఓటర్ల జాబితా సవరణకు ఈ సారి ఎన్నికల కమిషన్‌ నెల రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ సవరణ ముందే ఎందుకు ప్రారంభించలేదు అన్నది పెద్ద ప్రశ్న. ఓటర్లుగా నమోదు కావాలంటే ఆధార్‌ కార్డు ను ప్రమాణంగా స్వీకరించవచ్చు. భారతీయ పౌరులు అనుకున్న వారికే ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు ఇచ్చినప్పుడు మళ్లీ భారత పౌరులమని నిరూపించుకోవాలసిన అగత్యం ఏమిటి? 1987 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టిన వారైతే తమ తల్లిదండ్రుల జన్మ నిర్ధారణ సర్టిఫికేట్‌ కూడా అందజేయాలట. విపరీతమైన నిరాక్షరాస్యత, పేదరికం ఉన్న బీహార్‌లో ఈ సర్టిఫికేట్లు అందజేయడం ఎలా సాధ్యం? ఈ చేష్టలన్నీ సమానావ కాశాలు ఇవ్వకుండా ఉండడానికే. అందరికీ సమానావకాశాలు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో ప్రధానమైంది. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. ముందు సమూల ఓటర్ల జాబితా సవరణ అని 2024లో ప్రకటించారు. ఇప్పుడు ప్రత్యేక ఓటర్ల జాబితా అంటున్నారు. ఈ విషయం గురించి ఎన్నికల కమిషన్‌ ముందు ప్రకటించనే లేదు. పైగా ప్రత్యేక ఓటర్ల జాబితా రూపొందించే అధికారం జ్ఞానేశ్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్నికల కమిషన్‌కు ఎవరిచ్చారో! ఈ సమయంలో బీహార్‌ నుంచి చాలా మంది పంజాబ్‌లో పంట కోత కూలీలుగా పని చేయడానికి వెళ్తారు. వారికి ఎన్నికల కమిషన్‌ ఈ సమాచారం ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. మరి వారికి విషయం ఎలా తెలుస్తుంది! బతుకుదెరువు వదిలేసి ప్రత్యేక ఓటర్ల జాబితాలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి పరుగుపెట్టి రావడం కుదిరే పనేనా?

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు