విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే మళ్లీ భూ పంపిణీ కార్యక్రమం జరగాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేనపార్టీ నుంచి భూ లక్ష్మీ అనే పథకాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆమె చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామన్నారు. బంజరాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాకూడదని దాని ద్వారా విప్లవాత్మక గుణాత్మక మార్పు రావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఈ మార్పు కోసం తెలంగాణలో మేధావులంతా ఆలోచించి తమతో కలిసి రావాలన్నారు. ఈ నెల 6న తాము నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని తాము చెప్పామని… ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. 31 నెలలుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడని ముఖ్యమంత్రి ఇప్పుడు సామాజిక న్యాయం రాగం ఎత్తుకున్నారన్నారు. కానీ ఆయన చెప్పేది సామాజిక న్యాయం, చేసేది ఆటవిక న్యాయం అన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో బీసీలకు, మహిళలకు, ఎస్‌సీ, ఎస్‌టీలకు సామాజిక న్యాయం చేసే అవకాశం ఉన్న సరే చేయకుండా రాజకీయాల కోసం మాత్రమే ఆయన సామాజిక న్యాయం అంటున్నారని కవిత మండిపడ్డారు. ఎప్పుడో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సైతం లాక్కుంటూ ముఖ్యమంత్రి కుటుంబం తెలంగాణ భూమాత చెరబట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూదొంగలంటూ కవిత విమర్శించారు. కచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామన్నారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కుటుంబమే భూదోపిడీకి పాల్పడుతుందని కవిత తీవ్రంగా విమర్శలు చేశారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలకు అటు ప్రభుత్వంలో, పార్టీ లో న్యాయం చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నాడని కవిత అన్నారు. అలాంటి వ్యక్తి సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్నారు. కచ్చితంగా తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పాటు పడతామని అన్నారు.


