Homeతెలంగాణఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క

ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి : మంత్రి సీతక్క

- Advertisement -

విశాలాంధ్ర – హైదరాబాద్ : ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు నాయకత్వం వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డీలో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేసా చట్టం, గ్రామసభల ప్రాధాన్యత, సర్పంచుల విధులు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై సర్పంచు లకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సాధారణ గ్రామపంచాయతీలకు, షెడ్యూల్డ్ ఏరియా గ్రామపంచాయతీలకు చాలా తేడా ఉంటుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. పేసా చట్టం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పించారని, వాటిని సర్పంచులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. అడవులను, ప్రకృతిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీలకు వారి హక్కులపై పూర్తి అవగాహన ఉండాలని మంత్రి అన్నారు. గ్రామసభ నిర్ణయాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, గ్రామానికి సంబంధించిన అభివృద్ధి, వనరుల వినియోగం వంటి అంశాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని చెప్పారు. పేసా చట్టం ఇచ్చిన అధికారాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టడం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ‘మీరు కేవలం సర్పంచులుగా కాకుండా.. మీ గ్రామాల మార్గదర్శకులుగా నిలవాలి. ఐదేళ్ల పదవీకాలాన్ని ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకువచ్చే అవకాశంగా భావించాలి. ఈ మూడు రోజుల శిక్షణలో నేర్చుకున్న విషయాలను గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలి’ అని సీతక్క అన్నారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గ్రామసభలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా సామాజిక మార్పునకు వేదికలుగా ఉపయోగించుకోవాలని సీతక్క అన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, మహిళలపై వేధింపులు లేకుండా చూడటం, పిల్లల విద్యను ప్రోత్సహించడం, పోషకాహారం, ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామసభల్లో చర్చించి ప్రజలతో సామూహిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ‘ఒక గ్రామసభలోనే మన గ్రామంలో ఇకపై ఒక్క బాల్య వివాహం కూడా జరగకూడదని తీర్మానం చేసుకోవచ్చు. మహిళలకు ఎలాంటి వేధింపులు ఉండకూడదని నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి సామాజిక మార్పులకు గ్రామసభలను ఉపయోగించుకోవాలి” అని మంత్రి తెలిపారు. ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీతక్క కోరారు. ఇప్పపువ్వు లడ్డూ, మిల్లెట్స్‌ బిస్కెట్లు వంటి స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ ఆహారంతో పాటు మహిళలకు, స్థానిక కుటుంబాలకు ఆదాయ మార్గాలు కల్పించవచ్చని చెప్పారు. ఆరోగ్యం ప్రకృతితో ముడిపడి ఉండేలా సంప్రదాయ ఆహార విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా పాలన సాగించాలని, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సర్పంచులకు మంత్రి సూచించారు.ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. “మీరు లీడ్ తీసుకోండి.. మీ గ్రామాలను ముందుకు తీసుకెళ్లండి.. ప్రభుత్వం మీ వెంటే ఉంటుంది” అని సర్పంచులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.ఆర్.హెచ్. ఆర్.డి. డీ.జీ. శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, శిక్షణ కార్యక్రమ కోఆర్డినేటర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్కను శాంతి కుమారి సన్మానించారు. మంత్రి సీతక్క తో మహిళా సర్పంచుల గ్రూప్ ఫోటో దిగారు. ఇలాంటి కార్యక్ర మాలు సర్పంచు లందరికి నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు