Homeఆంధ్రప్రదేశ్విశాఖ విమానాశ్రయంకార్మికులకు ఉపాధి చూపండి

విశాఖ విమానాశ్రయంకార్మికులకు ఉపాధి చూపండి

- Advertisement -


గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం భంతో విశాఖ ఎయిర్పోర్టు కార్మికులు ఉపాధి కోల్పోయి వీధినపడ్డారని, వారికి తక్షణమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి వైభోగంగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య, పౌర విమాన సేవల ప్రారంభంతో పాత విశాఖ ఎయిర్పోర్టు మూగబోయింది. ఇక్కడ పౌర, వాణిజ్య విమాన కార్యకలాపాలు ఆగస్టు 17 నుండి అర్ధాంతరంగా నిలిపివేశారు. షెడ్యూల్ చేయబడిన అన్ని దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు అధికారికంగా భోగాపురంలో ఉన్న కొత్త అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న కార్మికులకు వేదనే మిగిలింది. వివిధ విభాగాలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, హౌస్కీపింగ్, సహాయక సిబ్బంది దాదాపు 700 మంది జీవనోపాధి కోల్పోయారు. వీరంతా 1980 నుండి ఇక్కడ పనిచేస్తున్నారు. వీరికి గత 15 రోజులుగా జీతాలు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. ఈ కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా, కనీసం జీతాల బకాయిలు చెల్లించ కుండా అర్ధాంతరంగా విధుల నుండి తొలగించడంతో వారి రోజువారీ జీవనం భారమై ఆందోళన చెందుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో పార్కింగ్ ఫీజులు భారీగా వసూలు చేస్తుండడంతో వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. దీనివల్ల టాకీస్‌ డ్రైవర్లు, పార్కింగ్ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటు న్నది. సమస్య తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విశాఖ ఎయిర్‌పోర్టులో తొలగించిన అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికులకు బకాయిపడిన జీతాలు వెంటనే చెల్లించాలి. ఉపాధి కోల్పోయిన వారందరికీ తగిన పరిహారం ఇవ్వాలి. నూతనంగా పౌర విమాన సేవలు ప్రారంభించిన భోగాపురం విమానాశ్రయంలో వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని, పార్కింగ్ ఫీజులు తగ్గించేలా చర్యలు చేపట్టాలని ఈశ్వరయ్య కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు