Homeఆంధ్రప్రదేశ్గ్రూప్-1 నియామకాల్లో వ్యవస్థాగత మోసం

గ్రూప్-1 నియామకాల్లో వ్యవస్థాగత మోసం

- Advertisement -

ఏబీ వెంకటేశ్వరరావు
విశాలాంధ్ర`విజయవాడ (గాంధీనగర్): ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 నియామకాల్లో భారీ ఎత్తున మోసం, దగా జరిగాయని సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ అక్రమాలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాల న్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ హాస్యాస్పదంగా ఉందని, మూడు సార్లు మూల్యాంకనం చేసి అర్హత లేని వారికి పోస్టులు కట్టబెట్టారని తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్‌సీ వంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. ముఖ్యంగా ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఉన్న పి.ఎస్.ఆర్.ఆంజనేయులు కనుసన్నల్లోనే ఈ అరాచకాలు జరిగాయని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిజిటల్ మూల్యాంకనం చేయించి, మార్కులను ఎక్సెల్ షీట్లలో మార్చినట్లు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన మ్యాన్యువల్ మూల్యాంకనంలో కూడా భారీ అవకతవకలు జరిగాయని ఏబీ వెల్లడించారు. జవాబు పత్రాలను అత్యంత రహస్యంగా ఉంచాల్సి ఉండగా, వాటిని ‘హాయ్ ల్యాండ్’ కు పంపించి 84 రోజుల పాటు అక్కడ ఉంచారని తెలిపారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పేపర్లు దిద్దించామని కోర్టుకు అబద్ధాలు చెప్పి, కేవలం డిగ్రీ కళాశాలల అధ్యాపకులతో పేపర్లు దిద్దించారని, మార్కులను వైట్ ఫ్లూయిడ్ ఉపయోగించి దిద్దారని ఆరోపించారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, సుమారు 280 మంది విషయంలో జవాబు పత్రాల మొదటి పేజీలో ఒక బార్ కోడ్, లోపలి పేజీల్లో మరో బార్ కోడ్ వచ్చాయని ఆయన వివరించారు. ఒకే పేపర్‌లో రెండు రకాల హ్యాండ్ రైటింగ్లు ఎలా వచ్చాయో ఎవరూ మాట్లాడటం లేదని, దీనివల్ల అర్హులు రోడ్డున పడగా, అనర్హులు ఉద్యోగాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ అక్రమాలపై సరైన చర్యలు తీసుకోవడం లేదని, గతంలో ఈ నియామకాలు తప్పని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ఇప్పుడు అదే అభ్యర్థులకు ఫోకల్ పోస్టులు ఎలా ఇస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏపీపీఎస్‌సీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, తప్ప చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సెంటర్ ఫర్ లిబర్టీ నాయకులు నలమోతు చక్రవర్తి, ఏదూరూరి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు