కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు: ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రోన్ తయారీ, పరిశోధన, పరీక్షలు, శిక్షణ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు చేపడు తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు డ్రోన్ సిటీలో డ్రోన్ పరిశ్రమలకు చెందిన సుమారు 150 మంది సీఈఓలు, సీఎక్స్ఓలు, సీఎఫ్‌ఓలు, ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. భవిష్యత్‌లో డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషించనుందని, డ్రోన్ల తయారీతో పాటు వాటి వినియోగానికి సంబంధించిన సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఓర్వకల్లు డ్రోన్ సిటీలో ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి ఓర్వకల్లులో 600 ఎకరాలను డ్రోన్ సిటీ కోసం కేటాయించారని తెలిపారు. ఇప్పటికే మొదటి దశలో 12 ప్లాట్లలో 8 ప్లాట్లను డ్రోన్ కంపెనీలకు కేటాయించామని, సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో వివిధ కంపెనీలకు స్థలాలు కేటాయించి తయారీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, డ్రోన్ కార్పొరేషన్ తరపున డ్రోన్ సిటీ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ డ్రోన్ పాలసీ, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపు విధానం, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కంపెనీల ప్రతినిధులకు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చినట్లు చెప్పారు. దేశంలోని హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక డ్రోన్ కంపెనీలు ఓర్వకల్లు డ్రోన్ సిటీని పరిశీలించిన అనంతరం తమ విస్తరణ కార్యకలా పాలను ఇక్కడే చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నా యన్నారు. మూడు నెలల కాలపరిమితితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కర్నూలు విమానాశ్రయంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా పైలట్ శిక్షణకు అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. మెల్స్టార్ ఎఫ్‌టీఓ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, మరో ఓరియంట్ ఎఫ్‌టీఓ కూడా ఏర్పాటు కానుందన్నారు. ఎఫ్‌టీఓ పైలట్ శిక్షణతో పాటు కర్నూలు ప్రాంతంలో ఉపాధి, వాణిజ్య, సేవా రంగాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
డ్రోన్ సిటీగా ఓర్వకల్లు అభివృద్ధి
- Advertisement -
RELATED ARTICLES


