Homeతెలంగాణమంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్‌రావు

మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి : హరీశ్‌రావు

- Advertisement -

విశాలాంధ్ర, మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గంలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించి, ప్రజలకు క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మల్కాజిగిరిలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీ శ్రీ దాసోజు శ్రవణ్, అంబర్‌పేట ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజిగిరి నియోజకవర్గంలో 22ఏ నిషేధిత జాబితా కారణంగా దాదాపు 30 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యన్నారు. ఎన్నో ఏళ్లుగా పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన భూములను అవసరాల కోసం విక్రయించేందుకు వెళ్లినప్పుడు అవి 22ఏనిషేధిత జాబితాలో ఉన్నాయని తెలియడంతో రిజిస్ట్రేషన్‌లు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల వివాహాలు, ఉన్నత విద్య, వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర అవసరాల కోసం తమ సొంత ఆస్తులను విక్రయించుకోవాలనుకున్నా రిజిస్ట్రేషన్‌లు జరగక ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి, 22ఏ నిషేధిత జాబితాను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథి హరీష్ రావు మాట్లాడుతూ… సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22ఏ నిషేధిత జాబితాలో చేరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి?” అని ప్రశ్నించారు. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్‌సిని రద్దు చేసిన తర్వాత అనేక భూములు పట్టా భూములుగా మారి, ఏళ్లుగా ప్రజలు వాటిపై హక్కులతో నివసిస్తున్నారని తెలిపారు. ఇన్నేళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు. రంగారెడ్డిలో జిఓ7500 ద్వారా మినహాయింపు పొందిన భూములు, మేడ్చల్లో వేలాది భూములు, హెచ్‌ఎండిఏ పరిధిలోని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండా భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. భూమిని విక్రయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లే వరకు తమ భూమి 22ఏ జాబితాలో ఉందనే విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. తిలక్నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి తన 450 గజాల ఇంటిని విక్రయించేందుకు వెళ్లిన సమయంలో అది నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసిందని, ఈ ఘటన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ఉదాహరణగా పేర్కొన్నారు. బిగ్ టీవీ జర్నలిస్ట్ అశోక్ తనకు ఎదురైన సమస్యను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారని, ఆయన ఒక్కరే కాకుండా అనేక మంది జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఇదే తరహా సమస్యలను ఎదుర్కొంటున్నారని హరీష్ రావు తెలిపారు. “తప్పు చేసి ఇప్పుడు సారీ చెబితే ప్రజల బాధలు తీరుతాయా? భూములను జాబితాలో చేర్చింది ఎవరు? ఎవరి ఆదేశాలతో చేర్చారు. అధికారుల పేర్లు చెప్పి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోకూడదు” అని అన్నారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచి వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజల్లో అనుమానాలు మరింత బలపడతాయని అన్నారు. ‘కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అండగా నిలుస్తాం” అని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, 22ఏ సమస్యతో బాధపడుతున్న వారు తమ సమస్యలను బీఆర్‌ఎస్ నాయకుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్, సబితా అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్, జగదీష్ గౌడ్, శిరీష జితేందర్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులు బద్ధం పరుశురాం రెడ్డి, జీకే హనుమంతరావు, జె.ఎ.సి. వెంకన్న, తోట నరేందర్ రెడ్డి, డోలి రమేష్, లక్ష్మణ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, భాగ్యనంద్ రావు, ఉస్మాన్, శివ గౌడ్, సాయి గౌడ్, సుమన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చిన్నం శ్రీనివాస్, రమేష్, రాజు యాదవ్, శోభన్ బాబు, ఢిల్లీ పరమేష్, సురేష్, బాలకృష్ణ, ఫరీద్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, జక్కుల కిరణ్, అనిల్, శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ యాదవ్, కిట్టు, బిక్షపతి, కనకరాజు, ఖలీల్, భాగ్యనందరావు, దినేష్, నవాబ్, మహేష్, మారుతి ప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు