మంత్రి అచ్చెన్నాయుడు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలను చట్ట సభలకు పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై మంగళవారం శాసన సభలో జరిగిన చర్చలో మంత్రులు అచ్చెన్నాయుడు, సవిత, కొల్లు రవీంద్రతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. బలహీనవర్గాలు ఎప్పటి నుంచో టీడీపీకి అండగా ఉంటున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. 1987లో ఎన్‌టీఆర్ హయాంలో తొలిసారిగా స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాటిని 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతున్నామని చెప్పి, చట్టాన్ని సవరించకుండా కేవలం జీవో ద్వారా నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఆ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ వైసీపీ సానుభూతిపరులతోనే కోర్టులో కేసులు వేయించారని ఆయన ఆరోపించారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించకపోవడం ద్వారా బీసీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉన్న చట్టంలో మార్పులు చేయాలంటే శాసనపరమైన సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కూటమికి బీసీలు అండగా నిలవాలని కోరారు. మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలకు అవకాశాలు కల్పించడం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం తమ బాధ్యత అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో రిజర్వేషన్లలో 10 శాతం కోత కారణంగా బీసీలు 16,800 పదవులకు దూరమయ్యారని తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు సవిత ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్లో బీసీల కోసం రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్లో రూ.51 వేల కోట్లు కేటాయించామని సవిత తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం శుభవార్త అని అన్నారు. వైసీపీ హయాంలో బీసీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
కూటమికి బీసీలు అండగా నిలవాలి
- Advertisement -
RELATED ARTICLES


