Homeఆంధ్రప్రదేశ్బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

- Advertisement -

విశాలాంధ్రబ్యూరో`అమరావతి: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిచేసేందుకు ప్రత్యేక కేబినెట్ సమా వేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నామని చంద్ర బాబు తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన భారీ విజయానికి బీసీల మద్దతు, నాయకత్వంపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన నిబంధనలు చట్టా ల్లో ఉన్నాయని వివరించారు. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేదన్నారు. ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో ముందుకెళ్లారని తెలిపారు. ఎర్రం నాయుడు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, తెలంగాణలో దేవేందర్ గౌడ్ వంటి నాయకులను రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో ఎన్‌టీఆర్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు పేర్కొన్నారు.1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని. విమర్శించారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24.5 శాతానికి తగ్గించారన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యుత్తమంగా తీర్చిదిద్ది, బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పిస్తామన్నారు. బీసీ వర్గాల్లో అపారమైన నైపుణ్యం ఉందని, చీరను నేసి అగ్గిపెట్టెలో పెట్టగలిగే స్థాయిలో వారి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. ఈ నైపుణ్యానికి ఆధునిక సాంకేతికతను జోడించి బీసీల శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో బీసీలు 50.54 శాతం ఉన్నారని, వారికి విద్య, నైపుణ్యం, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్షిప్‌తో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పంచాయతీల నుంచి కేంద్ర మంత్రివర్గం వరకు బీసీలకు ప్రాధాన్యం దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగ పరిధిలో సామాజిక న్యాయం సాధించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగితేనే 16వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే గ్రాంట్లు అందే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రూ.2,300 కోట్ల గ్రాంట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1,562 కోట్ల గ్రాంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను శాసనసభ ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగినప్పటికీ ప్రస్తుతం జిల్లా పరిషత్లు 13 మాత్రమే ఉన్నాయని, ఇకపై 28 జిల్లా ప్రజా పరిషత్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు