మేరీల్యాండ్ గవర్నర్‌గా మళ్లీ ఎన్నిక
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో భారత సంసతి నాయకుల పాత్ర కీలకంగా మారింది. క్రమంగా వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు కీలక పదవులలో ఎన్నికయ్యారు. వీరిలో మేరీల్యాండ్ గవర్నర్ అరుణా మిల్లర్ ఒకరు. ఆమె డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, తెలుగు మూలాలు ఉన్న మిల్లర్ హైదరాబాద్‌లో జన్మించారు. వరుసగా రెండవసారి మేరీల్యాండ్ గవర్నర్ పదవిని దక్కించుకున్నారు. అరుణా మిల్లర్ 1964 నవంబరు 6న హైదరాబాద్‌లో జన్మించారు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. న్యూయార్క్‌లోని పబ్లిక్ స్కూల్స్‌లో అరుణా మిల్లర్ విద్యాభ్యాసం జరిగింది. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. డేవ్ మిల్లర్‌తో ఆమె వివాహం జరిగింది. మిల్లర్ దంపతులకు ముగ్గురు సంతానం. అరుణా మిల్లర్ రవాణా విభాగంలో ఇంజినీర్‌గా పనిచేశారు. కాలిఫోర్నియా, వర్జీనియా, హవాయ్ రాష్ట్రాల్లో 25ఏళ్ల పాటు సేవలందించారు. రోడ్డు భద్రత, ప్రజా రవాణాలో మెరుగైన వసతుల కోసం కృషి చేశారు. 1990లో మేరీల్యాండ్‌కు వెళ్లి మోంట్గోమరీ కౌంటీలో స్థిరపడ్డారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. డెమొక్రటిక్ పార్టీలో పనిచేశారు. 2010లో మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. 2010`18 వరకు సభ్యురాలిగా కొనసాగారు. కీలక కమిటీల్లో సేవలందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అవార్డులూ కూడా అందుకున్నారు. 2022లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన దక్షిణాసియా మహిళగా ఘనత సాధించారు. తాజా ఎన్నికల్లోనూ ఇదే పదవి నుంచి పోటీ చేసిన ఆమె తిరిగి ఎన్నికయ్యారు. అరుణా మిల్లర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు బాగా వచ్చు అని చెప్పారు. తన కుటుంబం అమెరికాకు రాక ముందు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిపారు. కొంతకాలం విజయవాడలో అమ్మమ్మ దగ్గర ఉన్నట్లు వెల్లడించారు. అమెరికాలో స్థిరపడినా తెలుగు మరచిపోలేదని, భాషపై పట్టుకోల్పేదని, ఇప్పటికీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతానని అరుణా మిల్లర్ తెలిపారు. శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తానన్నారు. సాంబారు, గోంగూర, వంకాయ కూరతోపాటు కొన్ని పచ్చళ్లూ ఇష్టమని చెప్పారు. వేదికపై నుంచి మాట్లాడాలంటే మొదట్లో భయపడేదాన్నని, కొంతకాలానికి ఆ భయాన్ని అధిగమించానని అరుణా మిల్లర్ తెలిపారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు పాటిస్తానని, అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. తొలిసారి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి చేపట్టేటప్పుడు భగవద్గీతపై ప్రమాణం చేసినట్టు వెల్లడించారు.


