శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉధంపూర్ జిల్లాలోని మజల్తా ప్రాంతంలోని బ్రెట్టల్ సోహన్, ఖుబ్బన్ అటవీ ప్రాంతాల్లో గాలింపు జరుపుతుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతిచెందిన వారికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలు న్నట్లు అధికారులు అనుమానిస్తు న్నారు. బుధవారం బ్రాటెల్ సోన్, ఖుబ్బన్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. రాత్రి 9 గంటల సమయంలో సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. నిర్దిష్ట ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించారు. ఆపరేషన్ మొదలైన కాసేపటికే ఉగ్రవాదుల స్థావరం లక్ష్యంగా భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. పేలుళ్ల శబ్దాలు కూడా అటవీప్రాంతంలో వినిపించాయి. అయితే గురువారం ఉదయం భద్రతా వలయాన్ని తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరగడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమైనప్పటికీ, ప్రాంతంలో మరెవరైనా దాక్కున్నారా అనే కోణంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ పూర్తిగా ముగియలేదని సైన్యం స్పష్టం చేసింది. మిగిలిన ముప్పును గుర్తించి నిర్వీర్యం చేసేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో మోహరించి ఉన్నాయని వైట్ నైట్ కార్ప్స్ తెలిపింది.


